T20 World Cup | షార్జా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్-బీలో షార్జా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలమై ఈ టోర్నీలో తొలి అపజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి లారా వోల్వార్డ్ (39 బంతుల్లో 42, 3 ఫోర్లు) మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్ (26) ఆఖర్లో వేగంగా ఆడింది. స్వల్ప ఛేదనను ఇంగ్లండ్.. 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండర్ సీవర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్, 6 ఫోర్లు) రాణించగా గత మ్యాచ్‌లో మాదిరిగానే ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ (43 బంతుల్లో 43, 4 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడింది. రెండు వికెట్లు తీసిన సోఫీ ఎకిల్స్టొన్ (2/15)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
నత్తనడకన సఫారీ ఇన్నింగ్స్..
స్పిన్‌కు అనుకూలిస్తున్న షార్జాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లారా వోల్వార్డ్ ఎంత తప్పు చేసిందో అర్థం కావడానికి ఆ జట్టుకు పెద్దగా టైమ్ పట్టలేదు. సోఫీ ఎకిల్స్టొన్, చార్లీ డీన్, అలీస్ క్యాప్సీ వంటి నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన ఇంగ్లండ్ ఆది నుంచే సఫారీలను కట్టడి చేశారు. బంతికో పరుగు చొప్పున ఆ జట్టు ఇన్నింగ్స్ సాగింది. ఓపెనర్ బ్రిట్స్ (13) డేనియల్ గిబ్సన్‌కు క్యాచ్ ఇచ్చింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సౌతాఫ్రికాకు పరుగుల రాక కష్టమైంది. 7 నుంచి 12వ ఓవర్ మధ్య సౌతాఫ్రికా 5 ఓవర్లలో 23 రన్స్ మాత్రమే చేయగలిగింది. 15 ఓవర్లలో ఆ జ ట్టు స్కోరు 85/2గా ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో కూడా పరుగుల రాక గగనమవడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లండ్దీ అదే కథ..
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ ఛేదనలో ఇంగ్లండ్ సైతం తడబడింది. కాప్ వేసిన తొలి ఓవరే మెయిడిన్ అయింది. తనే వేసిన 5వ ఓవర్లో కాప్.. బౌచర్ (5)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పం పింది. 5 ఓవర్లలో ఇంగ్లండ్ చేసిన స్కోరు 16 పరుగులే. కానీ అలీస్ క్యాప్సీ (19) మూడు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చింది. కానీ క్యాప్సీ.. డి క్లర్క్ బౌలింగ్‌లో ఆమెకు రిటర్న్ క్యాచ్ ఇచ్చింది. వికెట్లు కోల్పోయినా.. సీవర్, వ్యాట్ హాడ్జ్ మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను గెలుపు తీరాలకు చేర్చారు.
సంక్షిప్త స్కోర్లు