గువహతి : నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశ ముగియడంతో ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్‌లే. నాకౌట్ దశలో భాగంగా నేడు నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాతో తొలి సెమీస్‌లో తలపడనుంది. గువహతి వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకాబోయే ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత నవంబర్ 02న జరుగబోయే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇరుజట్లు ఐదేసి విజయాలు సాధించినా 11 పాయింట్లతో ఇంగ్లండ్.. 10 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచి సెమీస్ పోరుకు సిద్ధమయ్యాయి. సెమీస్‌లో ఇంగ్లండ్.. సఫారీల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు గాను ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. మరి ఇంగ్లిష్ స్పిన్ త్రయం (ఎకిల్స్టొన్, డీన్, స్మిత్)ను తట్టుకుని సఫారీలు నిలబడతారా? అన్నది ఆసక్తికరం.