మాంచెస్టర్ : భారత బ్యాటర్లు పరుగుల కోసం తంటాలు పడ్డ చోట ఇంగ్లండ్ దంచుడు మంత్రాన్ని జపిస్తున్నది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆ జట్టు రెండో రోజు బంతితో పాటు బ్యాట్‌తోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (100 బంతుల్లో 94, 13 ఫోర్లు), జాక్ క్రాలీ (113 బంతుల్లో 84, 13 ఫోర్లు, 1 సిక్స్) బజ్‌బాల్ ఆటతో అలరించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఒలీ పోప్ (20*), జో రూట్ (11*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇంకా 133 రన్స్ వెనుకబడి ఉంది. వికెట్ల వేటలో భారత బౌలర్లు తేలిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా.. ఓవర్‌నైట్ స్కోరు (264/4)కు మరో 94 రన్స్ జోడించి 358 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ (5/72) ఐదు వికెట్లతో మెరవగా జోఫ్రా ఆర్చర్ (3/73) రాణించాడు.
ఇంగ్లండ్ పేసర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో రెండో రోజు భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైనా లోయరార్డర్ బ్యాటర్లు పోరాడటంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రెండో రోజు ఆటలో గిల్ సేనకు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆర్చర్.. జడేజా (20)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. కానీ శార్దూల్ (41), వాషింగ్టన్ (27) ఏడో వికెట్‌కు 48 రన్స్ జతచేయడంతో భారత్ 300 పరుగుల మార్కును అధిగమించింది. అయితే డ్రింక్స్ విరామం తర్వాత స్టోక్స్.. శార్దూల్‌ను ఔట్ చేసి భారత్ 400 టార్గెట్ ఆశలపై నీళ్లు చల్లాడు. శార్దూల్ స్థానంలో తొలిరోజు కాలిగాయంతో క్రీజును విడిచిన రిషభ్ పంత్ (54) బ్యాటింగ్‌కు వచ్చినా లంచ్ విరామం తర్వాత స్టోక్స్ భారత్‌కు మరో షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న వాషింగ్టన్‌ను ఇంగ్లండ్ సారథి షాట్బాల్తో బోల్తొ కొట్టించాడు. అదే ఓవర్లో అన్శుల్ సైతం ఒక్క పరుగు చేయకుండానే కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో స్టోక్స్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కాలినొప్పితోనే అర్ధ శతకం పూర్తిచేసిన పంత్.. ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతడే.. బుమ్రాను ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
బ్యాటింగ్‌లో ఆదినుంచే దూకుడుగా ఆడింది. భారత బ్యాటర్లు తడబడ్డ చోట డకెట్, క్రాలీ అలవోకగా బౌండరీలు బాదుతూ అలరించారు. ఓవర్‌కు ఐదు రన్‌రేట్‌కు తగ్గకుండా ఆ జట్టు దూకుడు ప్రదర్శించింది. అన్శుల్ వేసిన రెండో ఓవర్లో డకెట్ మూడు బౌండరీలు బాదిన అతడు.. బుమ్రా ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన క్రాలీ కూడా సిరాజ్ వరుస ఓవర్లలో రెండేసి బౌండరీలు సాధించడంతో ఇంగ్లండ్ స్కోరు పరుగులు పెట్టింది. టీ విరామానికే ఆ జట్టు 14 ఓవర్లలో 77 రన్స్ చేసింది. అర్ధ శతకాల తర్వాత ఈ జోడీ మరింత జోరు పెంచింది. ఠాకూర్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన క్రాలీ.. జడేజాకు ఒక సిక్స్, రెండు బౌండరీలతో స్వాగతం పలికాడు. కానీ డ్రింక్స్ అనంతరం జడ్డూ వేసిన ఓవర్లో అతడు.. స్లిప్స్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వడంతో 166 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే సెంచరీకి చేరువైన డకెట్.. శతకానికి ఆరు పరుగుల దూరంలో ఉండగా అన్శుల్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రూట్, పోప్ భారత బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ రెండో రోజును ముగించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (సాయి 61, జైస్వాల్ 58, స్టోక్స్ 5/72, ఆర్చర్ 3/73);
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 225/2 (డకెట్ 94, క్రాలీ 84, జడేజా 1/37, అన్శుల్ 1/48)