England clean sweep | పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో ఓడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో ఆడుతున్న ఇంగ్లిష్ జట్టు మూడో, ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. 60 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఇంగ్లండ్ చిత్తు చేసింది. కరాచీ టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ ముందు పాకిస్తాన్ కేవలం 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆఖరి రోజు తొలి సెషన్లోనే విజయాన్ని సొంతం చేసుకున్నది.
కరాచీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసింది. సమాధానంగా ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి 50 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ అయింది. నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించి విజయాన్ని అందుకున్నది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 35, బెన్ డకెట్ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాకిస్థాన్ తరఫున అబ్రార్ అహ్మద్ చివరి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాగలిగాడు. మిగిలిన బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
కరాచీలో విజయంతో 2022 లో ఆడిన మొత్తం 10 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు 9వ విజయం. ఇదే ఇంగ్లండ్ జట్టు అంతకుముందు 17 టెస్టుల్లో 1 మాత్రమే గెలిచింది. 17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లిష్ జట్టు టెస్ట్ సరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కరాచీ టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో, రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. తొలిసారిగా 1961-62 లో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. అప్పుడు నిర్వహించిన 3 టెస్టుల సరీస్‌ను 1-0 తో ఇంగ్లండ్ కైవసం చేసుకున్నది. ఆ తర్వాత సరిగ్గా 60 ఏండ్లకు తిరిగి పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ చరస్మరణీయమైన సిరీస్‌ను అందుకున్నది.