లండన్: మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలనుకున్న టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలమవడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో భారత్ 100 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా సిరీస్ 1-1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ (47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. డేవిడ్ విల్లే (41), బెయిర్‌స్టో (38), లివింగ్‌స్టోన్ (33) రాణించారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4.. బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) మరోసారి నిరాశ పర్చగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌటయ్యాడు. శిఖర్ ధవన్ (9), రిషబ్ పంత్ (0) విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (27), హార్దిక్ పాండ్యా (29), రవీంద్ర జడేజా (29) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 6 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య మాంచెస్టర్‌లో ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.
అయ్యో కోహ్లీ!
ఓ మోస్తరు లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఆరంభం నుంచి ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో తొలి నాలుగు ఓవర్లలో మనవాళ్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. గత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన కెప్టెన్ రోహిత్ వికెట్ల ముందు దొరికిపోగా.. ధవన్, పంత్, కోహ్లీ ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ 31 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా పోరాడే ప్రయత్నం చేయగా.. ఐదో వికెట్‌కు 42 పరుగులు జోడించాక సూర్యకుమార్ ఔటయ్యాడు. ఆదుకుంటాడనుకున్న పాండ్యా కూడా ఔట్ కావడంతో టీమ్ఇండియా కష్టాలు రెట్టింపయ్యాయి. ఆఖర్లో జడేజా, షమీ (23; 2 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి.
తిప్పేసిన చాహల్..
తొలి వన్డేలో భారత పేస్ ధాటికి చివురుటాకులా వణికిన ఇంగ్లండ్ టాపార్డర్ ఈ మ్యాచ్‌లో పట్టుదలతో ఎదురునిలిచింది. కుదురుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించిన ఓపెనర్లు రాయ్ (23), బెయిర్‌స్టో వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ఫలితంగా ఒక దశలో 72/1తో మంచి స్థితిలో నిలిచింది. ఆ సమయంలో చాహల్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. బెయిర్‌స్టోను క్లీన్ బౌల్డ్ చేసిన చాహల్.. రూట్ (11), బెన్ స్టోక్స్ (21) వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్యలో కెప్టెన్ బట్లర్ (4)ను షమీ వెనక్కి పంపాడు. ఫలితంగా ఇంగ్లిష్ జట్టు 102 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇక మరికాసేపట్లోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడుతుందనుకుంటే.. లోయర్ మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లే పట్టు విడవకుండా పోరాడరు. దీంతో ఇంగ్లండ్ మంచి స్కోరు చేయగలిగింది. వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద ఉన్నప్పుడు హార్దిక్ బౌలింగ్‌లో విల్లే ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ప్రసిద్ధ్ నేలపాలు చేశాడు. దీన్ని సద్వినియోగ పర్చుకున్న అతడు 41 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించడం గమనార్హం.