ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ మరోసారి ఆధిపత్యం దిశగా సాగుతోంది. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. టెస్టుల్లో నెంబర్ వన్‌గా ఉన్న న్యూజిల్యాండ్‌ను మూడు టెస్టుల్లో చిత్తుచేసింది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టు ఒక్కటంటే ఒక్క టెస్టులో కూడా విజయం సాధించలేదు.
కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. రూట్ (396 పరుగులు)తోపాటు స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో (394 పరుగులు) అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌కు మూడు టెస్టుల్లోనూ విజయాలు కట్టబెట్టారు. కివీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఐదో రోజున రూట్ (86 నాటౌట్), బెయిర్‌స్టో (71 నాటౌట్) అద్భుతంగా రాణించి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంది.
సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు చివరగా 2013లో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత నానాతిప్పలు పడిన ఆ జట్టు.. వెస్టిండీస్ పర్యటనలో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్.. కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి అద్భుతం చేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత సొంతగడ్డపై జట్టుకు తిరుగులేని టెస్టు సిరీస్ విజయాన్ని అందించాడు.