చెస్టర్ లి స్ట్రీట్ (యూకే): భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా ఆతిథ్య జట్టు ఛేదన సాధ్యం కాలేదు. తొలుత భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది. ఐర్లాండ్ టూర్లో నిరాశపరిచిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 68) ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటాడు.
యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), శివం దూబే (21 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 42 నాటౌట్) కూడాఆకట్టుకున్నారు. సాకిబ్ మహ్మూద్ (3/33) మూడు వికెట్లు పడగొట్టాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే సంజూ శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0) వికెట్లు కోల్పోయి 6/2తో ఇబ్బందుల్లో పడింది. సాకిబ్ బౌలింగ్‌లో శాంసన్ బాంటన్‌కు క్యాచ్ ఇవ్వగా.. ఇషాన్ రనౌటయ్యాడు.
ఈ దశలో కెప్టెన్ అయ్యర్ జతగా అభి పవర్‌ప్లేలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత అభి వెనుదిరగ్గా.. తిలక్ వర్మ (13) ఫెయిలయ్యాడు. శ్రేయస్ మాత్రం మంచి షాట్లతో అలరించాడు. ఆఖరి ఓవర్లలో శివం దూబే మెరుపుతో జట్టు మంచి స్కోరు చేసింది. కానీ, భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. రెండో టీ20 శనివారం జరుగుతుంది.