హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిధుల గోల్మాల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్.. మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరైన అజర్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తన హయం (2020-23)లో చోటు చేసుకున్న అక్రమాలపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో అజర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఏసీబీ నమోదు చేసిన రూ.20 కోట్ల కేసుతో పాటు ప్రస్తుత సీఈవో సునీల్ కాంటె వేసిన కేసు విషయంలో అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో హెచ్‌సీఏలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా డీజీ సెట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, కనోపీ మార్చే విషయంలో నిధుల గోల్మాల్ జరిగినట్లు తేలింది. అప్పటి కార్యవర్గంలో ఉన్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఇష్టారీతిన మార్కెట్ ధరకు మించి టెండర్ల జోలికి పనలు అప్పజెప్పినట్లు బయటపడింది. ఇదిలా ఉంటే కొంత మంది కావాలనే తనను ఇరికించేందుకు చూస్తున్నారని విచారణ సందర్భంగా అజర్ పేర్కొన్నాడు.