IND vs PAK : వరల్డ్ క్రికెట్లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచంలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా దాయాదుల గేమ్‌ను క్రికెట్ పండితులు అభివర్ణిస్తారు. అయితే.. దురదృష్టవశాత్తూ తరచుగా టీమిండియా, పాక్ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రిచర్డ్ గౌల్డ్ (Richard Gould) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాక్ టెస్టు మ్యాచ్‌కు తాము ఆతిథ్యమిస్తామని అన్నాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు టీ బ్రేక్ సమయంలో రిచర్డ్ బీబీసీ టెస్టు మ్యాచ్ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ.. ”ఇంగ్లండ్‌లో భారత్, పాక్ టెస్టును నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ దాయాదుల మ్యాచ్‌ను ఇష్టపడుతారు. చిరాకాల ప్రత్యర్థుల మధ్య మళ్లీ టెస్టు మ్యాచ్ జరపడం అసాధ్యమని నేను అనుకోవడం లేదు. కానీ, రాజకీయ అంశాల కారణంగా ఇరుజట్ల మధ్య క్రికెట్ మరింత జఠిలమవుతోంది’ అని రిచర్డ్ తెలిపాడు.
ఇంగ్లండ్ బోర్డు అధ్యక్షుడు రిచర్డ్ గౌల్డ్
అంతేకాదు వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీపై కూడా ఈసీబీ చీఫ్ స్పందించాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనే పాక్ గడ్డ మీద చాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించాలని అనుకుంటున్నాం’ అని అన్నాడు.
సరిహద్దు వివాదాల కారణంగా భారత్, పాకిస్థాన్ జట్లు అంతర్జాతీయ వేదికల మీదే తలపడుతున్నాయి. చివరిసారిగా 2013లో టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు భారత్ వచ్చింది. అయితే.. ఐసీసీ వరల్డ్ కప్ కోసం రెండు సార్లు దాయాది టీమ్ ఇండియాలో అడుగుపెట్టింది. భారత గడ్డపై 2011, 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడింది.