Headingley Test : హెడింగ్లే టెస్టులో టీమిండియా పట్టు సడలుతోంది. నాలుగోరోజు ఆఖరి సెషన్లో వికెట్ తీయలేకపోయిన పేసర్లు ఐదో రోజు తొలి సెషన్లోనూ తేలిపోయారు. స్వింగ్‌ను రాబట్టి ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేయడంలో విఫలయమయ్యారు. బజ్‌బాల్ ఆటతో టీమిండియా బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్లు బెన్ డకెట్ (64 నాటౌట్), జాక్ క్రాలే (42 నాటౌట్)లు స్కోర్‌బోర్డును ఉరికించారు. బౌండరీలతో విరుచుకుపడిన డకెట్ మెరుపు అర్ధ శతకం బాదాడు.
నాలుగో రోజు ధనాధన్ ఆడిన క్రాలే యాంకర్ రోల్ పోషించగా లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 96 పరుగులు పిండుకుంది. భోజన విరామానికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. ఇంకా రెండు సెషన్లు ఉండగా ఆ జట్టు విజయానికి 254 రన్స్ కావాలి. లంచ్ తర్వాత బుమ్రా దళం పుంజుకుంటే సరి.. లేదంటే స్టోక్స బృందం అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.
Lunch on Day 5 in Headingley
England 117/0 in the 4th innings, need 254 more runs
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND pic.twitter.com/w42IEN59CU
— BCCI (@BCCI) June 24, 2025
లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగోరోజు కేఎల్ రాహుల్(137), రిషభ్ పంత్(118)ల సెంచరీలతో మ్యాచ్‌పై పట్టుబిగించినట్టు కనిపించిన గిల్ సేన.. జోష్ టంగ్ విజృంభణతో ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అలవోకగా 400 రన్స్ కొట్టాల్సిన టీమిండియా.. రాహుల్ వికెట్ తర్వాత కుప్పకూలింది. 31 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.
అనంతరం 371 పరుగుల ఛేదనను ఇంగ్లండ్ ధాటిగ ఆరంభించింది. ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డకెట్ అజేయంగా నిలవగా ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 21 పరుగులు చేసింది. ఐదో రోజు తొలి సెషన్లో వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న భారత బౌలర్ల వ్యూహం ఫలించలేదు. ఎదురుదాడికి దిగిన డకెట్ సూపర్ ఫిఫ్టీతో తమ టీమ్‌కు శుభారంభమిచ్చాడు. మరో ఎండ్‌లో క్రాలే సైతం క్రీజులో పాతుకుపోవడంతో లంచ్ టైమ్‌కు ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 117 రన్స్ చేసింది.