Himanshi Khurana | బాలీవుడ్ ప్రముఖ నటి, గాయకురాలు హిమాన్షీ ఖురానాకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడతామనే హెచ్చరికలు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇంతకుముందు కూడా ఇలాంటి బెదిరింపులు బాలీవుడ్ ప్రముఖులకు వచ్చాయి. జీషన్ అక్తర్ అనే పేరుతో పంపిన ఈమెయిల్లో పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక వాయిస్ నోట్ ద్వారా నిందితుడు హిమాన్షీని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన హిమాన్షీ వెంటనే మొహాలీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంజాబీ చిత్రం ‘సద్దా హక్’తో వెలుగులోకి వచ్చిన హిమాన్షీ, బిగ్‌బాస్ సీజన్ 13 ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కేవలం హిమాన్షీ మాత్రమే కాకుండా, ఇటీవల స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, హీరో రణ్వీర్ సింగ్‌లకు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, వారిద్దరికీ వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే వారి వ్యక్తిగత సిబ్బందిని హతమారుస్తానని హెచ్చరించడం బాలీవుడ్ వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది. వరుసగా సినీ ప్రముఖులే లక్ష్యంగా సాగుతున్న ఈ బెదిరింపుల వెనుక ఉన్న ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.