Dubai League | టీ 20 ఇన్స్టంట్ క్రికెట్‌కు దుబాయ్ సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ టీ 20 (ఐఎల్టీ20) కప్పును సాధించేందుకు 6 జట్లు పోటీ పడనున్నాయి. ఈ 6 జట్లలో 5 భారతీయుల సొంతం కావడం విశేషం. ఫ్రాంచైజీ జట్లలో 84 మంది అంతర్జాతీయ, 24 మంది యూఏఈ ఆటగాళ్లను చేర్చారు. ఐఎల్టీ20 లో హెయిట్మార్, బ్రావో, పోలార్డ్, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, రాబిన్ ఉతప్పా, టామ్ కర్రన్ వంటి మేటి ఆటగాళ్లు టీ 20 ఎంజాయ్మెంట్ను అందించనున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే దుబాయ్ లీగ్‌లో ఆస్ట్రేలియా బిగ్ బాష్, దక్షిణాఫ్రికా లీగ్ మాదిరిగానే షెడ్యూల్ ఉంటుంది.
ఐపీఎల్ తర్వాత అత్యంత లాభదాయకమైన టోర్నమెంట్‌గా ఐఎల్టీ నిలిచింది. ఈ ఐఎల్టీ 20 ఛాంప్‌గా నిలిచేందుకు ముఖేష్ అంబానీ (ఎంఐ ఎమిరేట్స్) , గౌతమ్ అదానీ (గల్ఫ్ జెయింట్స్) , షారూఖ్ ఖాన్ (అబుదాబి నైట్ రైడర్స్) జట్లు మైదానంలో తలపడనున్నాయి. వీటితోపాటు జీఎంఆర్‌కు చెందిన దుబాయ్ క్యాపిటల్స్, రాజేశ్ శర్మకు చెందిన షార్జా వారియర్స్, యూఎస్ టీం డిజర్ట్ వైపర్స్ జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ప్రీ షెడ్యూల్ కారణంగా దుబాయ్ లీగ్‌లో టీమిండియా పెద్ద ఆటగాళ్లు ఆడటం లేదు. టాప్ ప్లేయర్ క్యాటగిరీకి గరిష్టంగా రూ.3.72 కోట్ల పరిమితిని ఉంచారు. దుబాయ్ లీగ్‌లో ఆటగాళ్లకు కూడా ఆఫర్ ఉంటుంది. ఆటగాళ్ల లీగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పన్ను రహితంగా చేయనున్నట్లు దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది.
లీగ్ ఫార్మాట్లో ప్రతి జట్టు రౌండ్-రాబిన్ పద్ధతిలో ఇతర జట్టుతో రెండుసార్లు ఆడుతుంది. 30 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్‌లు ఉంటాయి. దుబాయ్‌లో 16, అబుదాబిలో 10, షార్జాలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టులో యూఏఈకి చెందిన నలుగురు స్థానిక ఆటగాళ్లు ఉంటారు. లీగ్ ప్రారంభ వేడుకలో బాలీవుడ్ రాపర్ బాద్షా, ఆర్ అండ్ బీ గాయకుడు జాసన్ డెరులో ప్రదర్శన ఇవ్వనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆటగాళ్లు ఈ లీగ్‌లో తమదైన ముద్ర వేయగలరని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్ జరూనీ చెప్పారు. దుబాయ్ లీగ్ వారానికి 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.