Rapper Drake : అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, కెనడా ర్యాపర్ అబ్రే డ్రేక్ గ్రాహం మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కారణం ఏంటంటే… ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా గెలుస్తుందని డ్రేక్ పందెం కాశాడు. దురదృష్టం ఏంటేంటే..ఆ జట్టు ట్రోఫీ అందుకున్నా కూడా అతనికి చిల్లిగవ్వ కూడా రాలేదు. డ్రేక్ పందెం డబ్బులు 10 లక్షల డాలర్లు పోగొట్టుకున్నాడు. అదెలాగంటే.. అదనపు సమయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో, డ్రేక్ ఉసూరుమన్నాడు. మ్యాచ్ సమయం ముగిసేసరికి అర్జెంటీనా, ఫ్రాన్స్ 2-2తో సమానంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు అదనపు టైమ్ కేటాయించారు.
వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా డ్రేక్ 1×2 మార్కెట్లో 10 లక్షల డాలర్ల బెట్టింగ్ కాశాడు. బెట్టింగ్ వివరాలను స్క్రీన్‌షాట్ తీసి ఆన్లైన్లో పోస్ట్ పెట్టాడు. అతను ఊహించినట్టుగానే మెస్సీ జట్టు గెలిచింది. లెక్క ప్రకారం అతనికి 17.5 లక్షల డాలర్లు రావాలి. కానీ, అదనపు టైమ్ పుణ్యమాని ఒక్క డాలర్ కూడా రాలేదు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూట్లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. దాంతో, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ వరల్డ్ కప్ ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు.