ఢిల్లీ: వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టు పాల్గొనడం కష్టమే! కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ప్రతిష్టాత్మక క్రీడల్లో బ్లూ టైగర్స్ ప్రాతినిథ్యంపై సందిగ్ధం నెలకొంది. స్పోర్ట్స్ మినిస్ట్రీ బుధవారం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ఆసియా ఖండంలో వ్యక్తిగత విభాగంలో టాప్-6, టీమ్ ర్యాంకింగ్స్లో టాప్-8 ఉన్న జట్లనే ఆడేందుకు నామినేట్ చేస్తామని తెలిపింది.
భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఆసియాలో 24వ స్థానం (ప్రపంచవ్యాప్తంగా 134వ ర్యాంకు)లో ఉంది. మహిళల జట్టు సైతం 12వ స్థానంలో ఉండటంతో ఇరుజట్లకూ నిరాశ తప్పేలా లేదు. పతకాలు గెలిచే అవకాశం ఉన్న అథ్లెట్లు, జట్లు మాత్రమే పోటీలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టు 1951, 1962లో రెండు స్వర్ణాలు, 1970లో కాంస్యం గెలిచింది. ఆ తర్వాత ఒక్క పతకం కూడా రాలేదు.