Virat Kohli : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని రెచ్చగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖయా ఎన్తిని(Makhaya Ntini) అన్నాడు. మరి కొన్ని రోజుల్లో వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యర్థి జట్లన్నీ విరాట్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. కోహ్లీ పోటీని బాగా ఇష్టపడతాడని.. స్లెడ్జింగ్ (Sledging)చేసి అతడిని రెచ్చగొట్టాలని చూస్తే.. అది బౌలర్లకు పీడకల మిగల్చడం ఖాయమని ఎన్తిని అభిప్రాయ పడ్డాడు.
‘కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి జోలికి వెళ్లకూడదు. మా బౌలర్లకు నేనిచ్చే సలహా ఇదొక్కటే. ఎందుకంటే కోహ్లీ పోటీని అమితంగా ఇష్టపడతాడు. అతడిని రెచ్చగొడితే ఘోర పరాభవం తప్పదు. ప్రత్యర్థి ఆటగాళ్లు తనకు సవాల్ విసరాలని కోహ్లీ కోరుకుంటాడు. వాళ్లు స్లెడ్జింగ్ ప్రారంభిస్తే కోహ్లీ కోరుకున్నది జరుగుతుంది’ అని ఎన్తిని తెలిపాడు. తాజాగా కోహ్లీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా.. తనకు సవాళ్లు ఎదుర్కోవడమంటే ఇష్టమని.. 15 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్లో తనకు అవే ఉత్సాహాన్ని ఇస్తాయని కోహ్లీ అన్నాడు.
విరాట్ కోహ్లీ
కోహ్లీని ఎలా ఔట్ చేయగలమో కూడా ఎన్తిని చెప్పాడు. అతడి మానాన అతడిని వదిలేస్తే.. ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతాడని తెలిపాడు. ‘మ్యాచ్‌లో విరాట్‌ను ఎవరూ ఏమీ అనకుండా ఉంటే.. అతడికి విసుగొస్తుంది. అప్పుడు తప్పకుండా ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే కోహ్లీకి బౌలింగ్ చేసే సమయంలో వీలైనంత తెలివిగా ఆలోచించడం మంచిది’ అని ఎన్తిని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉందని ఈ మాజీ పేసర్ జోస్యం చెప్పాడు.