నైరోబి: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ దొడ్డ గణేశ్ కెన్యా జాతీయ జట్టుకు హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. 51 ఏండ్ల ఈ కర్నాటక మాజీ ఆటగాడు భారత్ తరఫున 4 టెస్టులు, ఒక వన్డే ఆడాడు. కానీ దేశవాళీ క్రికెట్లో కర్నాటకకు ఆడుతూ 365 వికెట్లు, 2వేల పరుగులు సాధించాడు. చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్ రేసులో వెనుకబడిపోయిన కెన్యాను గణేశ్ ఏ మేరకు పోటీలోకి తెస్తాడనేది ఆసక్తికరం.
దుబాయ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు హ్యాట్రిక్ సిరీస్పై కన్నేసిందని, తప్పుకుండా దానిని సాధించి తీరుతుందని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ఇంకా 3 నెలల సమయమున్నా రెండ్రోజుల క్రితం ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘ఈసారి ఆస్ట్రేలియా 3-1తో సిరీస్ గెలుస్తుంది’ అని జోస్యం చెప్పిన నేపథ్యంలో శాస్త్రి స్పందించాడు. ‘బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా చాలా పటిష్టంగా ఉంది. బుమ్రా, షమీ, సిరాజ్ జట్టులో ఉన్నారు. అశ్విన్, జడేజాతో పాటుగా బెంచ్లోనూ మెరుగైన బౌలర్లు భారత్ సొంతం’ అని అన్నాడు.