న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 16వ సీజన్లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. మరోవైపు బౌలర్లు కూడా తమ వాడి అయిన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో బౌలర్ల మీద బ్యాటర్లదే పైచేయి కనిపిస్తున్నది. కొందరు బౌలర్లయితే తమ టీ20 కెరీర్లోనే చెత్త రికార్డులను నమోదు చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ పేస్ బౌలర్ యశ్ దయాల్ ఈ జాబితాలో చేరాడు.
ఈ నెల 9న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో బ్యాటర్ రింకూ సింగ్ ఒకే ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. వాటితో కలిపి ఈ సీజన్లో ఇప్పటివరకు యశ్ దయాల్ ఇచ్చిన సిక్స్‌ల సంఖ్య 11కు చేరింది. దాంతో ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా యశ్ దయాల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఆ తర్వాత సీజన్లో మొత్తం 10 సిక్స్‌లు ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే ఈ చెత్త రికార్డులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 9 సిక్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. వివిధ జట్లకు చెందిన మరో నలుగురు బౌలర్లు ఎనిమిదేసి సిక్సర్ల చొప్పున ఇచ్చి నాలుగో స్థానంలో ఉన్నారు.