Australian Open : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కోర్టులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థులకు హడలే. పదునైన ఏస్‌లతో ఎంతటి ఆటగాడినైనా మట్టికరిపించే జకో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ వీరుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ స్టార్ ప్లేయర్ తన సొగసైటన ఆటతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో తొలి రౌండ్ సందర్భంగా జకోకు ఊహించని పరిస్థితి ఎదురైంది.
సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ‘నన్ను పెండ్లి చేసుకో జకో’ అనే మాటలు వినిపించాయి. ఆ మాట వినపడగానే చిన్నగా నవ్విన వరల్డ్ నంబర్ 1.. ‘ఇదివరకే నాకు పెండ్లి అయింది. సారీ’ అని జకోవిచ్ బదులిచ్చాడు.
నిరుడు ఆరు టైటిళ్లతో సంచలనం సృష్టించిన జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన జకో.. తొలి రౌండ్లో క్రొయేషియాకు చెందిన 18 ఏండ్ల కుర్రాడు డినో ప్రిజిమిక్(Dino Prizmic)పై అతి కష్టంగా గెలిచాడు. నాలుగు గంటల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తన అనుభవాన్నంతా ఉపయోగించిన సెర్బియా స్టార్ 6-2, 6-7 (5), 6-3, 6-4 తేడాతో ప్రిజిమిక్ను ఓడించాడు.
కోర్టులో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే జకోవిచ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన చిన్నప్పటి స్నేహితురాలు జెలెనాను 2014లో పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు స్టెఫాన్ జకోవిచ్, అమ్మాయి పేరు తారా జకోవిచ్.