వింబుల్డన్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ వింబుల్డన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శుక్రవారం జొకో 2-6, 6-3, 6-2, 6-4తో కామెరున్ నారీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. రెండున్నర గంటలకు పైగా సాగిన పోరులో తొలి సెట్ కోల్పోయిన జొకో.. ఆ తర్వాత విజృంభించి వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకొని తుదిపోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో 13 ఏస్‌లు సంధించిన జొకో.. 38 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 7 ఏస్‌లకే పరిమితమైన కామెరున్ 36 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. గాయం కారణంగా నాదల్ వింబుల్డన్ సెమీస్ నుంచి తప్పుకోగా.. ఆదివారం జరుగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిర్గియోస్‌తో జొకో అమీతుమీ తేల్చుకోనున్నాడు.