Australian Open | మెల్బోర్న్: ఆధునిక టెన్నిస్ దిగ్గజంగా వెలుగొందుతున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), భావి సూపర్‌స్టార్‌గా ఎదుగుతోన్న యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యారు. గత రెండేండ్లుగా వింబుల్డన్ ఫైనల్స్, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో ముఖాముఖి తలపడ్డ జొకో, అల్కరాజ్ హైఓల్జేజ్ సమరానికి ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ వేదికైంది. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లో గెలిచి క్వార్టర్స్‌లో తలపడనున్నారు.
ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకో.. 6-3, 6-4, 7-6 (7/4)తో జిరి లెహెకా (చెక్) ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. మ్యాచ్‌లో లెహెకా.. 11 ఏస్‌లు, 39 విన్నర్లతో జొకో (9, 27) కంటే ఎక్కువే సాధించినా.. 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో మ్యాచ్‌లో అల్కరాజ్.. 7-5, 6-1తో జాక్ డ్రాపర్ (బ్రిటన్)పై గెలిచాడు. రెండు సెట్ల తర్వాత డ్రాపర్ గాయంతో వెనుదిరగడంతో ఈ స్పెయిన్ కుర్రాడు క్వార్టర్స్‌కు వాకోవర్ సాధించాడు. ఇక మిగిలిన మ్యాచ్‌లలో జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 2-6, 6-3, 6-2తో హంబర్ట్ (ఫ్రాన్స్)ను చిత్తు చేయగా టామీ పాల్.. 6-1, 6-1, 6-1తో డేవిడోవిచ్ (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.
మహిళల సింగిల్స్‌లో అమెరికా అమ్మాయి కోకో గాఫ్ జోరు కొనసాగుతోంది. ప్రిక్వార్టర్స్‌లో గాఫ్.. 5-7, 6-2, 6-1తో బెలిండా (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఈ సీజన్లో ప్రత్యర్థికి తొలిసారిగా ఒక సెట్ కోల్పోయిన గాఫ్.. తిరిగి పుంజుకుని వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ సబలెంక 6-1, 6-2తో మిర్రా ఆండ్రీవాపై అలవోక విజయం సాధించింది. భారత వెటరన్ బోపన్న, ఎస్.జెంగ్ (చైనా) జంట ఈ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.