ముంబై: ముంబై, విదర్భ మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్‌పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. విదర్భ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (11), భూపేన్ లల్వాణి (18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా..కెప్టెన్ రహానే(58 నాటౌట్), ముషీర్‌ఖాన్(51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో రాణించారు.
ఈ సీజన్లో ఫామ్‌లేమితో తీవ్రంగా సతమతమవుతున్న రహానే ఫైనల్ పోరులో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. యువ బ్యాటర్ ముషీర్ జతగా రహానే సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదడంతో ముంబై ప్రస్తుతం 260 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. యశ్ ఠాకూర్, హర్ష్‌దూబే ఒక్కో వికెట్ తీశారు. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 31/3తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 105 కుప్పకూలింది. యశ్ రాథోడ్ (27) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ధవల్ కులకర్ణి(3/15), తనుశ్ (3/7), శమ్స్ ములానీ (3/32) మూడేసి వికెట్లు తీశారు.