టోక్యో : ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్‌తో పాటు స్టిపుల్చేజర్ పారుల్ చౌదరీ ఘోరంగా నిరాశపరిచారు. సోమవారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గ్రూపు-ఏలో క్వాలిఫికేషన్ రౌండ్లో పోటీకి దిగిన శ్రీశంకర్ అత్యుత్తమంగా 7.78మీటర్లు దూకి 14వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా మొత్తం 37 మందిలో 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత మూడేండ్ల వ్యవధిలో శంకర్‌కు ఇదే చెత్త ప్రదర్శన.
క్వాలిఫయింగ్ మార్క్ 8.15మీటర్లు లేదా తొలి 12 స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. గాయం కారణంగా గతేడాది పారిస్ ఒలింపిక్స్ సహా అన్ని టోర్నీలకు దూరమైన ఈ 26 ఏండ్ల అథ్లెట్..ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు ముందు ఐదు టైటిళ్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో భారత అథ్లెట్లు పారుల్ చౌదరీ (9:22:24సె), అంకిత ధయాని (10:03:22సె) వరుసగా 20, 35 స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు. పురుషుల 110మీటర్ల హర్డిల్స్‌లో తేజాస్ షిర్సె హీట్స్‌లోనే వెనుదిరిగాడు.