Mohammed Siraj: హైదరాబాదీ పేసర్, భారత క్రికెట్ అభిమానులు ‘మియా’ అని పిలుచుకునే మహ్మద్ సిరాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడు హైదరాబాద్ ఫ్యాన్స్‌ను ‘చిల్లర్’ అని సంబోధించినట్టు చెబుతున్న ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. సిరాజ్ తన స్వంత అభిమానులను ఇలా అనడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న సిరాజ్.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.
వివరాల్లోకెళ్తే.. ఐపీఎల్ 2021 సందర్భంగా ఆర్సీబీ చేసిన ఇంటర్వ్యూలో సిరాజ్ స్పందిస్తూ.. ‘‘నేను గ్రౌండ్‌కు వెళ్లినప్పుడల్లా అక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చి హైదరాబాద్ లాంగ్వేజ్ (ఉర్దూ)లో ‘సిరాజ్ ఏం చేస్తున్నావ్..? ఎక్కడికి వెళ్తున్నావ్..?’ అని అనేవారు. అప్పుడు నేను ‘అరేయ్.. ఈ చిల్లర్ క్రౌడ్ ఇక్కడకు కూడా వచ్చింది’ అని చెప్పేవాడిని. నేను ఐపీఎల్‌లోకి వచ్చి ఆడుతున్నా వీళ్లు ఏ మాత్రం మారలేదు. అలాగే ఉన్నారు…’’ అని చెప్పాడు.
ఈ వీడియోను తాజాగా సిరాజ్_క్రిక్ అని ఉన్న ఓ పేజ్‌లో షేర్ చేయగా హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పాతదైనప్పటికీ తన స్వంత అభిమానులను అలా ట్రీట్ చేయడం సిరాజ్‌కు తగదని హితువు పలుకుతున్నారు. సిరాజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ స్థాయికి ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని సూచిస్తున్నారు.