ప్లే ఆఫ్స్ చేరిన చెన్నై
హైదరాబాద్‌పై ఘనవిజయం
వరుసగా నాలుగో విజయంతో కదంతొక్కిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 14వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిస్తే.. మరో మూడు మ్యాచ్‌లుండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్
పోరాటం ముగిసింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన సన్‌రైజర్స్.. బౌలింగ్లోనూఅద్భుతాలు చేయలేకపోయింది!
షార్జా: గతేడాది పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో జూలు విదిల్చింది. మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో వరుస విజయాలతో మోతెక్కించిన చెన్నై.. ఐపీఎల్ 14వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గురువారం ఇక్కడ జరిగిన పోరులో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓదార్పు విజయం సాధించిన విలియమ్సన్ సేన.. తిరిగి ఓటమి బాట పట్టడంతో పాటు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (44) టాప్ స్కోరర్ కాగా.. స్టార్ ఆటగాళ్లు జాసన్ రాయ్ (2), కేన్ విలియమ్సన్ (11), హోల్డర్ (5) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హజిల్‌వుడ్ 3, బ్రావో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై చెలరేగిపోయింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు.
స్కోరు బోర్డు
హైదరాబాద్: రాయ్ (సి) ధోనీ (బి) హజిల్‌వుడ్ 2, సాహా (సి) ధోనీ (బి) జడేజా 44, విలియమ్సన్ (ఎల్బీ) బ్రావో 11, గార్గ్ (సి) ధోనీ (బి) బ్రావో 7, అభిషేక్ (సి) డుప్లెసిస్ (బి) హజిల్‌వుడ్ 18, సమద్ (సి) అలీ (బి) హజిల్‌వుడ్ 18, హోల్డర్ (సి) దీపక్ (బి) శార్దూల్ 5, రషీద్ (నాటౌట్) 17, భువనేశ్వర్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 134/7. వికెట్ల పతనం: 1-23, 2-43, 3-66, 4-74, 5-109, 6-110, 7-117, బౌలింగ్: దీపక్ 4-0-32-0, హజిల్‌వుడ్ 4-0-24-3, శార్దూల్ 4-0-37-1, బ్రావో 4-0-17-2, జడేజా 3-0-14-1, అలీ 1-0-5-0.
చెన్నై: గైక్వాడ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 45, డుప్లెసిస్ (సి) కౌల్ (బి) హోల్డర్ 41, అలీ (బి) రషీద్ 17, రైనా (ఎల్బీ) హోల్డర్ 2, రాయుడు (నాటౌట్) 17, ధోనీ (నాటౌట్) 14, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 19.4 ఓవర్లలో 139/4. వికెట్ల పతనం: 1-75, 2-103, 3-107, 4-108, బౌలింగ్: సందీప్ 3-0-18-0, భువనేశ్వర్ 4-0-34-0, హోల్డర్ 4-0-27-3, రషీద్ 4-0-27-1, కౌల్ 2.4-0-24-0, అభిషేక్ 2-0-9-0.