Dhoni – Gambhir : భారత మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇద్దరూ ఇద్దరే. ఒకరు విజయవంతమైన నాయకుడు అయితే మరొకరు విధ్వంసక ఓపెనర్. అయితే.. 2011 వన్డే వరల్డ్ కప్ నుంచి వీళ్లకు ఒకరంటే ఒకరికి పడదని మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా విక్టరీలో తనకు దక్కాల్సిన ఘనతనంతా మహీ భాయ్ లాగేసుకున్నాడని గౌతీ పలుమార్లు పరోక్షంగా ధోనీపై విమర్శలు గుప్పించాడు కూడా. అయితే.. మిస్టర్ కూల్ సారథి మాత్రం అవేమీ పట్టనట్లు సైలెంట్‌గా ఉండేవాడు. ఆ వరల్డ్ కప్ నుంచి ఉప్పు నిప్పులా ఉంటున్నఈ ఇద్దరూ ఈమధ్యే ఒక వేడుకలో కలిశారు.
భారత జట్టుకు ఆడిన గొప్ప ఓపెనర్లలో గౌతం గంభీర్ ఒకడైతే.. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ధోనీ. రికార్డులు పక్కన పెడితే టీమిండియాకు ఇద్దరూ అందించిన సేవలు చిరస్మరణీయం. 2011 వరల్డ్ కప్ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాంతో అప్పటి నుంచి అంటీముట్టనట్టుగా మెలుగుతున్న ఈ దిగ్గజ క్రికెటర్లు తాజాగా గుజరాత్ మంత్రి హర్ష్ సాంఘ్వీ సోదరుడు ఉత్కర్ష్ సాంఘ్వీ పెళ్లిలో తళుక్కుమన్నారు.
Gautam Gambhir and MS Dhoni picturized together at a wedding.
📸: House of Events | Instagram #GautamGambhir #MSDhoni pic.twitter.com/KFDyqbMiJZ
— Circle of Cricket (@circleofcricket) August 16, 2025
తెలుపు రంగు చొక్కా, ఆకుపచ్చ బ్లేజర్‌తో ధోనీ యమా స్టయిలిష్‌గా కనిపించగా.. బూడిదరంగు పార్టీ షర్ట్‌లో గౌతీ మెరిసిపోయాడు. గౌతీ, మహీలు ఒక్కచోట ఉండడం చూసిన ఫొటోగ్రాఫర్ కెమెరాకు పని చెప్పాడు. ఫొటో కోసమని ఇష్టం లేకపోయినా ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. ఈ ఫొటో చూసిన వాళ్లంతా వారిద్దరి మధ్య వైరం ముగిసిందని.. ఇద్దరూ ఇప్పుడూ స్నేహితుల్లా ఉంటారని ఆశిస్తున్నారు. పిక్చర్ ఆఫ్ ది డే అంటూ ఈ ఫొటోను రీట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ పెళ్లి వేడుకలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ పార్థీవ్ పటేల్, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు.
ధోనీ, గంభీర్ల విషయానికొస్తే.. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో ఇద్దరూ గొప్పగా రాణించారు. ఫైనల్లో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని కరిగించడంలో ఓపెనర్ గౌతీ(97) గట్టి పునాది వేయగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన ధోనీ(91నాటౌట్) ధనాధన్ ఆటతో విరుచుకుపడ్డాడు. కులశేఖర ఓవర్లో భారీ సిక్సర్‌తో తనదైన స్టయిల్లో జట్టును గెలిపించాడు మిస్టర్ కూల్ కెప్టెన్. రిటైర్మెంట్ తర్వాత ఇద్దరూ భిన్న దారులను ఎంచుకున్నారు.
మహీ భాయ్ తన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తోనే కొనసాగుతుండగా.. గౌతీ మాత్రం భారత జట్టు ప్రధాన కోచ్ పదవి దక్కించుకున్నాడు. గంభీర్ మార్గనిర్దేశనంలో ఈమధ్యే ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం చేసింది. మరోవైపు.. వయసు, గాయాల ప్రభావంతో ధోనీ వచ్చే సీజన్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.