అంటాల్యా భారత స్టార్ ఆర్చర్, తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ అర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఆటలో అజేయ శక్తిగా ఉన్న దక్షిణా కొరియా జోరుకు బ్రేక్ వేస్తూ గంటల వ్యవధిలోనే రెండు స్వర్ణాలు నెగ్గి ఔరా అనిపించాడు. 17 ఏండ్ల యువ కెరటం కుంకుమ్ మొహోద్‌తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకొని తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ‘గోల్డెన్ డబుల్’ సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన 24 ఏండ్ల ధీరజ్ 7-3 తేడాతో , పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, దక్షిణ కొరియా దిగ్గజం లీ వూ సియోక్‌కు షాకిచ్చాడు.
తన కెరీర్లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణాన్ని అందుకున్నాడు. హై-ప్రెషర్ ఫైనల్లో ధీరజ్ ఆరంభం నుంచే పక్కా గురితో కొరియా ఆటగాడిపై ఒత్తిడి పెంచాడు. మొదటి రెండు సెట్లను 30-29, 29-28తో గెలుచుకొని 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత కొరియా అర్చర్ పుంజుకొని ఆధిక్యాన్ని 3-5కు తగ్గించినా ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. నిర్ణయాత్మక ఐదో సెట్లో ఒత్తిడిని అధిగమిస్తూ వరుసగా మూడు పర్ఫెక్ట్ 10లు కొట్టి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ పోరులో కొరియా ఆర్చర్‌ను భారత ప్లేయర్ ఓడించడం గత 14 ఏండ్లలో ఇదే తొలిసారి. చివరగా 2012లో ఇదే వరల్డ్ కప్‌లో దీపికా కుమారి ఈ ఘనత సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో 2-4తో వెనుకంజలోనిలిచినా అద్భుత పుంజుకున్న ధీరజ్ 6-4తో జర్మనీ ఆర్చర్ మోరిట్జ్ వీజర్ను ఓడించి ఫైనల్ చేరుకున్నాడు.

వ్యక్తిగత విభాగంలో స్వర్ణ వేటకు రెండు గంటల ముందే కుంకుమ్ మొహోద్‌తో కలిసి మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ ధీరజ్ సంచలనం సృష్టించాడు. రికర్వ్ మిక్స్ డ్ టీమ్ ఫైనల్లో ధీరజ్-కుంకుమ్ జంట 5-1 తేడాతో ఒలింపిక్ చాంపియన్స్ ఓ యే జిన్- కిమ్ జె డియోక్ (దక్షిణాకొరియా) జోడీని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. వరల్డ్ కప్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు నాలుగేండ్ల తర్వాత దక్కిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. ధీరజ్ తెచ్చిన రెండు స్వర్ణాలతో భారత్ రెండో స్థానంతో ఈ టోర్నీని ముగించింది. చైనా మూడు స్వర్ణాలతో అగ్రస్థానం అందుకుంది.