అంతర్జాతీయ క్రీడా వేదికపై మరో తెలంగాణ క్రీడా తార తళక్కుమంది. తన గురికి తిరుగులేదని నిరూపిస్తూ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ పసిడి కాంతులు విరజిమ్మాడు. జర్మనీలో ఇటీవలే జరిగిన ప్రపంచ బధిర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త రికార్డులతో స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. వినికిడి లోపమున్నా..సాధారణ షూటర్లకు ఏమాత్రం తీసిపోని ధనుశ్ పతక వేటలో దూసుకెళుతున్నాడు. 14 ఏండ్ల ప్రాయంలో షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిచ్చరపిడుగు డెఫ్ ఒలింపిక్స్, డెఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. లాస్ ఎంజిల్స్(2028) ఒలింపిక్స్ తన లక్ష్యమంటున్న ధనుశ్.. ఆ దిశగా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన ఈ యువ షూటర్ ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తు న్నాడు. మద్దతిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తానంటున్న ధనుశ్‌పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
Dhanush Srikanth | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: తెలంగాణలో ప్రతిభ కల్గిన క్రీడాకారులకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ..అద్భుతాలు సృష్టించే ప్లేయర్లు కోకొల్లలు. ఇప్పుడే ఇదే కోవలోకి వచ్చాడు యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్. పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మించిన ధనుశ్ ఏనాడు నిరాశకు లోనుకాలేదు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని చేతల్లో చూపిస్తూ షూటింగ్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నాడు. ఇటీవలే జర్మనీలో జరిగిన ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన నేపథ్యంలో ధనుశ్ ప్రస్థానంపై అతని తల్లి ఆశా శ్రీకాంత్ పలు అంశాలు పంచుకుంది.
పసి ప్రాయం నుంచే
పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లు పసి ప్రాయం నుంచే ధనుశ్ క్రీడల పట్ల అమితాసక్తి ప్రదర్శించాడు. స్కూల్లో నిర్వహించే ప్రతీ క్రీడాపోటీల్లో పతకంతో వచ్చేవాడు. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు మూడో తరగతిలో ఉన్నప్పుడే తైక్వాండోలో చేర్పించారు. ఇంట్లో సరదాగా బొమ్మ తుపాకీతో గంటల తరబడి ధనుశ్ ప్రాక్టీస్ చేసేవాడని తల్లి ఆశ తెలిపింది. అతని ఆసక్తిని గమనించిన పేరెంట్స్ 2015లో గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో జరిగిన తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 400కు 400 షూట్ చేసిన తొలి షూటర్‌గా శ్రీకాంత్ రికార్డు నెలకొల్పాడు.
గురువుకు తగ్గ శిష్యుడు
లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్‌కు తగిన శిష్యుడని ధనుశ్ నిరూపించుకుంటున్నాడు. గురువుకు తగ్గట్లే 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పతకాల పంట పండిస్తున్నాడు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వేర్వేరు అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 13 పతకాలు సాధించాడు.
ప్రపంచ రికార్డులతో స్వర్ణాలు
ప్రపంచ డెఫ్ షూటింగ్ టోర్నీలో ధనుశ్ 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రెండు ప్రపంచ రికార్డులు(632.7, 251.7) తన పేరిట లిఖించుకున్నాడు. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ కేటగిరీలో భారత్‌కు రెండు పసిడి పతకాలు అందించాడు. ఇదే జోరుతో 2028లో లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా ధనుశ్ ముందుకెళ్తాడని ధనుశ్ తల్లి పేర్కొంది.
ప్రభుత్వ ప్రోత్సాహం కోసం
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ధనుశ్‌ను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఖరీదైన క్రీడ అయిన షూటింగ్లో రాణించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆశ పేర్కొంది. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే..భవిష్యత్‌లో దేశానికి ధనుశ్ మరిన్ని పతకాలు తీసుకొస్తాడని ఆమె తెలిపింది.