గాలె: రెండేండ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 131 బ్యాటింగ్) తన టాలెంట్ చూపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీతో విజృంభించడంతో శ్రీలంకతో శనివారం మొదలైన మొదటి టెస్టులో భారత్‌కు అద్భుత ఆరంభం లభించింది. మూడో స్థానానికి సరైనోడినని నిరూపిస్తూ పడిక్కల్ చేసిన అజేయ శతక గర్జనకు తోడు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (77 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటడంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 73 ఓవర్లలో 288/2 స్కోరుతో తొలి రోజు ఆట ముగించింది. వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించినా జోరు తగ్గని పడిక్కల్‌కు తోడుగా రిషబ్ పంత్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
జైస్వాల్ రనౌట్.. పడిక్కల్ అదుర్స్
2024లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడిన పడిక్కల్ సుదీర్ఘ విరామం తర్వాత తుది జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. కొలంబో వామప్ మ్యాచ్‌లో అద్భుత శతక ఫామ్‌ను ఇక్కడా కొనసాగించాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలుత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32), రాహుల్ జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చారు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్‌ను దురదృష్టం వెంటాడింది. సింగిల్ తీసే క్రమంలో బౌలర్‌ను ఢీకొన్న అతను రాహుల్‌తో సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. కానీ, రాహుల్‌కు పడిక్కల్ తోడైన తర్వాత భారత్ మరింత జోరు పెంచింది. ప్రారంభంలో పేసర్ లహిరు కుమారా బౌలింగ్‌లో రాహుల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. తన బౌలింగ్‌లోనే పుల్ షాట్‌తో ఫోర్ కొట్టి లయ అందుకున్నాడు. ఆతిథ్య స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌కు దిగినా.. భారత బ్యాటర్లు అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
మంచి ఫామ్‌లో ఉన్న పడిక్కల్ క్రీజును ముందుకొచ్చి తన బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆపై రాహుల్ కూడా స్ట్రెయిట్ సిక్సర్, ఫోర్ సాధించాడు. లంక అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ నువాంత, కెప్టెన్ ధనంజయ డిసిల్వా పిచ్‌పై కొంత టర్న్, బౌన్స్ సాధించినప్పటికీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. దాంతో భారత్ 101/1తో తొలి సెషన్ ముగించింది. రెండో సెషన్‌కు ముందు గంటా 20 నిమిషాల పాటు వర్షం కారణంగా ఆట నిలిచిపోయినా పడిక్కల్ ఏకాగ్రత చెదరలేదు. లంక బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ స్వీప్, కవర్ డ్రైవ్, లేట్ కట్ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో 81 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ 127 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 197/1తో టీ బ్రేక్‌కు వెళ్లొచ్చిన తర్వాత కాలు కండరాలు పట్టేయడంతో రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. కెప్టెన్ గిల్ (16) జయసూర్య వేసిన ఫ్టయిలెడ్ బంతికి ఉదారకు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటైనా.. వెనక్కుతగ్గని పడిక్కల్ లహిరు కుమార బౌలింగ్‌లో సింగిల్ తీసి శతక మైలురాయిని చేరుకున్నాడు. తర్వాత మరోసారి వర్షం వచ్చినా ఆట తిరిగి మొదలైన తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 52 పరుగులు జోడించి తొలి రోజు ఆట ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 73 ఓవర్లలో 288/2 (పడిక్కల్ 131 బ్యాటింగ్, రాహుల్ 77, ప్రభాత్ జయసూర్య 1/78).
600 టెస్టుల్లో భారత్‌కు ఇది 600వ మ్యాచ్. అత్యధిక టెస్టులు ఆడిన మూడో జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ (1097), ఆస్ట్రేలియా (883) టాప్-2లో ఉన్నాయి.