బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న నిరుటి రన్నరప్ ఢిల్లీ..మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టాప్‌లోకి దూసుకెళ్లింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 127/9 స్కోరుకే పరిమితమైంది. భారతి(40 నాటౌట్)మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలింగ్ ధాటికి గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. హర్లిన్ డియోల్(5), లిచ్‌ఫీల్డ్(0), కెప్టెన్ గార్డ్నర్(3), కాశ్వి గౌతమ్(0), బేత్మూనీ(10) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. మారిజానె కాప్(2/17), శిఖాపాండే(2/18), సదర్లాండ్(2/20) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ..15.1 ఓవర్లలో 131/4 స్కోరు చేసింది. జెస్ జొనాసెన్(32 బంతుల్లో 61 నాటౌట్, 9ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించింది. షెఫాలీవర్మ(44) ఆకట్టుకుంది. కాశ్వి గౌతమ్(2/26) రెండు వికెట్లు తీసింది.