మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ రికార్డు చేజింగ్ మ్యాచ్ మరువక ముందే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ పోరు పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన మ్యాచ్‌లో ముంబైపై ఢిల్లీనే విజయం వరించింది. నిర్దేశిత లక్ష్యఛేదనలో షెఫాలీవర్మ, నికిత ప్రసాద్ మెరుపులతో ఢిల్లీ లీగ్‌లో అదిరిపోయే బోణీ కొట్టింది. నాట్ స్కీవర్ అజేయ అర్ధసెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న ముంబై..ఢిల్లీపై విజయాన్ని అందుకోలేకపోయింది.
వడోదరా: డబ్ల్యూపీఎల్..ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళుతూ అభిమానులను అలరించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. గెలుపు కోసం ఇరు జట్లు తలపడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆర్సీబీ, గుజరాత్ మ్యాచ్‌కు కొనసాగింపుగా ఢిల్లీ, ముంబై పోరు ఫ్యాన్స్‌ను ఊపేసింది.
ముంబై నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. షెఫాలీవర్మ(43), అరంగేట్రం ప్లేయర్ నికి ప్రసాద్(35) రాణించగా, అరుంధతిరెడ్డి చివరి బంతికి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించింది. మాథ్యూస్(2/32), అమెలియా కెర్(2/21) రెండేసి వికెట్లు తీశారు. తొలుత ముంబై..నాట్ స్కీవర్( 59 బంతుల్లో 80 నాటౌట్, 13ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(42) ఆకట్టుకుంది. సదర్లాండ్(3/34), శిఖాపాండే(2/14) రాణించారు. నికికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
సూపర్ నికి: నిర్దేశిత లక్ష్యఛేదనలో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ ఆది నుంచే ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ విరుచుకుపడింది. ఇషాకి వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో షెఫాలీ 6, 4, 4,4, 4తో ఏకంగా 22 పరుగులు పిండుకుంది. షెఫాలీకి కెప్టెన్ మెగ్‌లానింగ్ చక్కని సహకారం అందించింది. ఓవైపు షెఫాలీ చెలరేగుతుంటే మరో ఎండ్‌లో లానింగ్ చక్కని సమన్వయంతో ముందుకు సాగింది.
మాథ్యూస్ వేసిన ఆరో ఓవర్లో షెఫాలీ రెండు ఫోర్లు, సిక్స్‌తో దూకుడుమీదన్న స్థితిలో కౌర్‌కు ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత లానింగ్(15), రోడ్రిగ్స్(2), సదర్లాండ్(13) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో అలీస్ క్యాప్సె(16), నికి ప్రసాద్ జట్టును గాడిలో పడేశారు. వీరిద్దరు ముంబై బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాగారు.
ముఖ్యంగా డబ్ల్యూపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే నికి అద్భుత పరిణతి కనబరిచింది. సాఫీగా సాగుతున్న క్రమంలో క్యాప్సె ఔట్ కావడంతో ఢిల్లీ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సారా బ్రైస్(21)..నికీకి జతకలిసింది. స్కీవర్ 17వ ఓవర్లో బ్రైస్ ఓ ఫోర్, సిక్స్‌తో అలరించింది. అయితే 7 పరుగుల తేడాతో బ్రైస్‌తో పాటు పాండే(2) ఔట్ కావడంతో ముంబై పోటీలోకి వచ్చింది. ఓవైపు సహచరులు వరుసగా నిష్క్రమిస్తున్నా..నికీ వెనుకకు తగ్గలేదు. చివరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో తొలి బంతినే నికీ ఫోర్‌గా మలిచింది. ఆ తర్వాత 2, 1 పరుగులు చేసిన నికీ ఐదో బంతికి ఔటైంది. దీంతో సమీకరణం కాస్తా ఒక బంతికి 2 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న అరుంధతి అద్భుతమైన డైవింగ్‌తో జట్టుకు విజయాన్నందించింది.
ముంబై : 19.1 ఓవర్లలో 164 ఆలౌట్(స్కీవర్ 80 నాటౌట్, హర్మన్‌ప్రీత్ 42, సదర్లాండ్ 3/34, పాండే 2/14), ఢిల్లీ: 20 ఓవర్లలో 165/8(షెఫాలీ 43, నికీ ప్రసాద్ 35, కెర్ 2/21, మాథ్యూస్ 2/32)