ముంబై: బ్యాటర్లు మరోసారి విధ్వంసం సృష్టించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. జెస్ జాన్సన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (34 నాటౌట్) సత్తాచాటారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. తహిలా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లో జాన్సన్ 3 వికెట్లు పడగొట్టింది. జెస్ జాన్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.