ఢిల్లీ: మరో ఏడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నప్పటికీ క్యాపిటల్స్ యాజమాన్యం మాత్రం అక్షర్‌కే పట్టం కట్టింది. 2019 సీజన్ నుంచి ఢిల్లీకి ఆడుతున్న అక్షర్.. ఆరు సీజన్లలో 82 మ్యాచ్‌లు ఆడి 967 పరుగులు చేయడమే గాక 62 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో అక్షర్‌ను ఢిల్లీ.. రిషభ్ పంత్‌ను వదిలేసి మరీ టాప్ రిటెన్షన్ కింద రూ. 16.50 కోట్లతో రిటైన్ చేసుకున్నప్పుడే ఈ సీజన్లో అతడు సారథిగా ఉంటాడన్న వార్తలు వచ్చాయి. అయితే వేలంలో ఆ జట్టు రాహుల్, డుప్లెసిస్‌ను దక్కించుకోవడంతో వారికి ఆ అవకాశం దక్కొచ్చన్న గుసగుసలు వినిపించాయి.
కానీ రాహుల్ మాత్రం తనకు కెప్టెన్సీ వద్దని, ఆటగాడిగా కొనసాగుతానని మేనేజ్మెంట్కు తేల్చిచెప్పడంతో అక్షర్‌కు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా అక్షర్.. దేశవాళీ క్రికెట్లో గుజరాత్‌ను సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలలోనూ నడిపించాడు. గతేడాది అతడు భారత టీ20 జట్టులో సూర్యకు డిప్యూటీగా వ్యవహరించాడు.
కెప్టెన్‌గా నియమితుడైన నేపథ్యంలో అక్షర్ స్పందిస్తూ.. ‘ఢిల్లీకి సారథ్య బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచినందుకు ఫ్రాంచైజీ ఓనర్లు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని తెలిపాడు.