డబ్ల్యూపీఎల్‌లో పరుగుల జాతర సాగుతున్నది. తొలి మ్యాచ్‌లో హర్మన్ మెరుపులు మరువక ముందే.. రెండో పోరులో షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నచందంగా చెలరేగిన షఫాలీ ఢిల్లీకి కొండంత స్కోరు అందించగా.. ఛేదనలో కాస్త పోరాడిన బెంగళూరు లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఇక చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మరో మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం డబుల్ హెడర్.. మహిళా క్రికెట్ అభిమానులకు డబుల్ ఆనందాన్నిచ్చింది.
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్లో అదిరిపోయే మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఆదివారం జరిగిన తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెం డో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై యూపీ వారియర్స్ 3 వికెట్లతో గెలుపొందింది. మొదటి పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు రెచ్చిపోగా.. మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మరీనె కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 రన్స్ చేసింది. కెప్టెన్ స్మృతి మందన (35), పెర్రీ (31), నైట్ (34), షుట్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకుంది.
18 బంతుల్లో 53..
హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) టాప్ స్కోరర్ కాగా.. యూపీ బౌలర్లలో దీప్తి, సోఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. యూపీ విజయానికి మూడు ఓవర్లలో 53 పరుగులు అవసరమైన దశలో గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హారిస్‌తో పాటు నవగిరె (53), సోఫీ (22 నాటౌట్) రాణించడంతో యూపీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు పడగొట్టిన ఫలితం లేకపోయింది. లీగ్‌లో గుజరాత్‌కు ఇది రెండో పరాజయం. సోమవారం ముంబైతో బెంగళూరు తలపడనుంది