ఐపీఎల్ తాజా సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత గాడి తప్పుతున్నది. లక్నోతో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం ముగిసిన పోరులోనూ బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గత సీజన్ ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ ఓటములకు కారకుడైన పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగిన ఢిల్లీ.. వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
IPL | విశాఖపట్నం: కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో ఐపీఎల్-18 ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. తొలి మ్యాచ్‌లో లక్నోపై ఉత్కంఠ విజయాన్ని అందుకున్న ఆ జట్టు.. మలిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) పేస్ దెబ్బకొట్టగా కుల్దీప్ యాదవ్ (3/22) స్పిన్ మాయకు హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎస్ఆర్హెచ్ను ఆదుకున్నారు. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (32 బంతుల్లో 38, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచడంతో క్యాపిటల్స్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
స్వల్ప ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు డుప్లెసిస్, మెక్‌గర్క్ సగం లక్ష్యాన్ని 9 ఓవర్లలోనే దంచేశారు. షమీ మూడో ఓవర్లో 6, 4తో బాదుడుకు శ్రీకారం చుట్టిన డుప్లెసిస్. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. మెక్‌గర్క్ అతడికి చక్కని సహకారం అందించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికే ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 52 రన్స్ చేసింది. కమిన్స్ 7 ఓవర్లో 4, 6తో రెచ్చిపోయిన డుప్లెసిస్ హర్షల్ 9వ ఓవర్లో సింగిల్ తీసి 26 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తిచేశాడు. అరంగేట్ర స్పిన్నర్ జీషన్ అన్సారీ ఒకే ఓవర్లో ఓపెనర్లను ఔట్ చేసినా ఢిల్లీ పెద్దగా ఇబ్బందిపడలేదు. కేఎల్ రాహుల్ (15)నిరాశ పరిచినా పొరెల్ (18 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టబ్స్ (21 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అనికేత్ ఇన్నింగ్సే హైలైట్. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అది అనికేత్ వల్లే. క్లాసెన్ అండతో అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విప్రాజ్ నిగమ్ 7వ ఓవర్లో 4,6తో పరుగుల వేట మొదలెట్టిన అనికేత్.. మరుసటి ఓవర్లో అక్షర్నూ రెండు సిక్సర్లతో అరుసుకున్నాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ కూడా వేగంగా ఆడాడు. కానీ కుదురుకుంటున్న దశలో మోహిత్ శర్మ 11వ ఓవర్లో క్లాసెన్‌ను ఔట్ చేయడంతో ఎస్ఆర్హెచ్ మళ్లీ కష్టాల్లో పడింది. కుల్దీప్.. వరుస ఓవర్లలో అభినవ్ (4), కమిన్స్ (2) ను ఔట్ చేశాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేసిన అనికేత్.. అక్షర్ 15వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. కానీ తర్వాత ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన అతడు.. బౌండరీ లైన్ వద్ద మెక్‌గర్క్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
లక్నో మ్యాచ్‌లో మాదిరిగానే ఢిల్లీతోనూ సన్‌రైజర్స్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. అభిషేక్ (1) తొలి ఓవర్లోనే రనౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. తన రెండో ఓవర్లో స్టార్క్.. ఇషాన్ కిషన్ (2)తో పాటు ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0)నీ ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు డబుల్ షాకులిచ్చాడు. తన తర్వాతి ఓవర్లో ట్రావిస్ హెడ్ (12 బంతుల్లో 22, 4 ఫోర్లు)నూ పెవిలియన్‌కు పంపి రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
2 ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రలో ఒక బౌలర్ ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి కాగా 17 ఏండ్లలో ఇదే ప్రథమం. 2008లో ఆ జట్టు స్పిన్నర్ అమిత్ మిశ్రా (5/17) డెక్కన్ ఛార్జర్స్‌పై ఫైఫర్ నమోదుచేశాడు.
హైదరాబాద్: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్ (అనికేత్ 74, క్లాసెన్ 32, స్టార్క్ 5/35, కుల్దీప్ 3/22);
ఢిల్లీ: 16 ఓవర్లలో 166/3 (డుప్లెసిస్ 50, మెక్‌గర్క్ 38, అన్సారీ 3/42)