SRH vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ యువ కెరటం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(65) చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హైదరాబాద్ బౌలర్లను ఉతికారేసిన ఫ్రేజర్ 15 బంతుల్లోనే యాభై బాదాడు. దాంతో, 16 బంతుల్లో ఫిఫ్టీతో రికార్డు నెలకొల్పిన సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు రెండో స్థానానికి పడిపోయారు.
అయితే.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) పేరిట ఉంది. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు నిరుడు 13 బంతుల్లోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హాఫ్ సెంచరీ బాదేశాడు. హైదరాబాద్ నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో వరుసగా రెండు కీలక వికెట్లు పడడంతో ఢిల్లీ స్కోర్ వేగం తగ్గింది. ప్రస్తుతం రిషభ్ పంత్(4), ట్రిస్టన్ స్టబ్స్(9)లు క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 143/4.
భారీ ఛేదనలో 25 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో ఫ్రేజర్ జతగా అభిషేక్ పొరెల్(42) దంచాడు. స్పిన్, పేస్ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మార్కండే విడదీశాడు. తొలుత ఫ్రేజర్‌ను వెనక్కి పంపిన అతడు 9వ ఓవర్లో పొరెల్‌ను స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అంతకుమందు డేంజరస్ ఓపెనర్ పృథ్వీ షా(16)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపగా.. ఆ తర్వాత భువనేశ్వర్ నకుల్ బాల్‌తో డేవిడ్ వార్నర్(1)ను బోల్తా కొట్టించాడు.