న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), కొకో గాఫ్ (అమెరికా) ముందంజ వేశారు. తన కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జొకో.. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లలో భాగంగా పురుషుల సింగిల్స్‌లో 6-2 6-2, 6-4తో రాడు అల్బోట్ (మాల్దోవా)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఈ టోర్నీలో జొకోకు ఇది 89వ విజయం కావడం విశేషం. తద్వారా అతడు రోజర్ ఫెదరర్ విజయాల రికార్డు(89)ను సమం చేశాడు. రెండో రౌండ్లో అతడు సెర్బియాకే చెందిన లస్లో జెరెతో తలపడనున్నాడు.
మిగిలిన మ్యాచ్‌లలో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కాస్పర్ రూడ్ (బ్రిటన్), టేలర్ ఫ్రిట్జ్ తొలి రౌండ్ విజ్ఞాన్ని విజయవంతంగా దాటారు. అయితే 2020 యూఎస్ ఓపెన్ చాంపియన్ అయిన డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 4-6, 2-6, 2-6తో బెన్ షెల్టన్ (అమెరికా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.
మహిళల సింగిల్స్‌లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ 6-2, 6-0తో వర్వర గ్రచెవ (ఫ్రాన్స్)ను ఓడించింది. ఇటీవలి కాలంలో అంతగా ఫామ్‌లో లేని గాఫ్ యూఎస్ ఓపెన్‌లో మాత్రం దూకుడు ప్రదర్శించింది. రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6-3, 6-3తో ప్రిసిల్లా (ఆస్ట్రేలియా)ను ఓడించి తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లింది. క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), అజరెంక (బెలారస్) సైతం రెండో రౌండ్లోకి ప్రవేశించారు.