UTT | చెన్నై: భారత స్టార్ ప్యాడ్లర్ సతియన్ జ్ఞానశేఖరన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకు ఆటగాడు ఖ్వాద్రి అరుణను ఓడించినా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న దబాంగ్ డిల్లీకి తొలి మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో భాగంగా చెన్నైలో యూముంబాతో జరిగిన పోరులో 9-6తో ఢిల్లీ పరాభవంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది.
పురుషుల సింగిల్స్‌లో సతియన్ 2-1తో ఖ్వాద్రిపై గెలిచినా మహిళల సింగిల్స్‌లో ముంబై ప్యాడ్లర్ సురిత ముఖర్జీ.. దియా చిటాలెపై వరుసగా మూడు సెట్లలో గెలిచి ఆ జట్టును పోటీలోకి తెచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్ ఠక్కర్, మరియ ద్వయం.. 2-1తో సతియన్, ఒరవన్ను ఓడించారు.
అనంతరం ఠక్కర్.. 2-1తో అండ్రీస్ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌లో మరియ 1-2తో ఒరవన్ చేతిలో ఓటమిపాలైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లలో ఢిల్లీ.. చెన్నై లయన్స్‌తో తలపడనుండగా యూముంబా.. జైపూర్ ప్యాట్రియట్స్ను ఢీకొననుంది.