షాంఘై (చైనా): ఆర్చరీ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఒకేరోజు ఏకంగా ఐదు పతకాలతో దుమ్మురేపిన కాంపౌండ్ ఆర్చర్లు ఇచ్చిన స్ఫూర్తితో రికర్వ్ ఆర్చర్లూ సత్తాచాటారు. ఆదివారం జరిగిన రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో భారత సీనియర్ ఆర్చర్ దీపికా కుమారితో పాటు పురుషుల సింగిల్స్‌లో పార్థ్ సుశాంత్ కాంస్యాలతో మెరిశారు. ఈ ఇద్దరూ ఆదివారం ముగిసిన రికర్వ్ సెమీస్ మ్యాచ్‌లలో ఓడినప్పటికీ కాంస్య పోరులో మాత్రం పుంజుకుని పతకాలు ఖాతాలో వేసుకున్నారు. మహిళల రికర్వ్ సెమీస్‌లో దీపిక.. 1-7తో లిమ్ సిహ్యోన్ చేతిలో ఓడినప్పటికీ.. కాంస్య పోరులో 7-3తో కొరియాకే చెందిన కంగ్ చె యంగ్‌ను ఓడించింది.
తొలి సెట్లో ఇరువురు ఆర్చర్లు 27 పాయింట్లతో స్కోరు సమం అయినా రెండో సెట్ నుంచి దీపిక పుంజుకుంది. ఒత్తిడిలోనూ గురితప్పని లక్ష్యంతో బాణాలను సంధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇక పురుషుల విభాగంలో పార్థ్.. సెమీస్‌లో పరాభవం పాలైనా కీలకమైన కాంస్య పోరులో మాత్రం గురి తప్పలేదు. పార్థ్ 6-4తో బాప్టిస్టె అడిస్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రపంచకప్‌లో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీని భారత్ మొత్తం ఏడు పతకాలతో ముగించింది.