‘లోడ్.. ఎయిమ్.. షూట్..’ ఆమె మాట ఆ శిష్యులకు సుగ్రీవాజ్ఞ. బరిలో దిగిన ప్రతిసారీ గురి ‘తప్పేదే లే’ అంటారు వాళ్లు. అలా వాళ్లను తీర్చిదిద్దిన గురువు మరెవరో కాదు.. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన దీపాలీ దేశ్‌పాండే! ద్రోణుడు ద్రుపద రాజ్యం వదిలి.. కురుపాండవులను మెరికల్లా తీర్చిదిద్దాడు. ఆయన దగ్గర శస్త్ర విద్యలన్నీ ఆపోశన పట్టిన అర్జునుడు ద్రుపదుణ్ని పట్టి బంధించి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. దీపాలీ జీవితంలోనూ ఇలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. ఆమె దగ్గర అస్త్ర విన్యాసాలు నేర్చుకున్న శిష్యులు.. గురి తప్పని విజయాలతో తమ గురువుకు పట్టం కట్టారు. ద్రోణాచార్య పురస్కారాన్ని గురుదక్షిణగా ఇచ్చారు.
Deepali Deshpande | దీపాలీ దేశ్‌పాండే ముంబయిలో పుట్టింది. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. చదువుల్లో తన గురి తప్పేది కాదు. షూటింగ్‌లోనూ అంతే నేర్పరి. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించారు. బీపీ బామ్, సంజయ్ చక్రవర్తి దగ్గర శిక్షణ తీసుకుంది. అనతి కాలంలోనే జాతీయస్థాయి దాటి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. 2004లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది. రైఫిల్ షూటింగ్లో వెండి పతకం గెలిచింది. అదే ఏడాది ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 50 మీటర్ల షూట్లో 19వ స్థానంతో సరిపెట్టుకుంది.
కొన్నాళ్ల తర్వాత దీపాలీ అంతర్జాతీయ పోటీలకు దూరమైనా షూటింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. ముంబయిలో 2010లో షూటింగ్ క్లబ్ నెలకొల్పింది. మెరికల్లాంటి షూటర్లను తయారు చేయాలన్నది ఆమె సంకల్పం. అదే సమయంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జూనియర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలనుకుంది. దానికి దీపాలీని చీఫ్ కోచ్‌గా నియమించింది. అప్పుడు ఆమె దగ్గర మెలకువలు నేర్చుకున్న షూటర్లు ఇప్పుడు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. అంజుమ్ మౌద్గిల్, కుసాలే ఆమె శిష్యులే. అంజుమ్ 2012 నుంచి జూనియర్స్ విభాగంలో చక్కగా రాణిస్తూ వచ్చింది. మరోవైపు దీపాలీ సీనియర్ షూటర్లకూ చీఫ్ కోచ్‌గా శిక్షణ మొదలుపెట్టింది. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అంజుమ్ వెండి పతకం గెలుచుకుంది. దీపాలీ శిష్యులు బరిలో దిగారంటే పతకం ఖాయం అన్న పేరు వచ్చేసింది.
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన షూటింగ్ వరల్డ్ కప్ 2019లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరిలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సౌరభ్ చౌదరి కూడా దీపాలీ కాంపౌండ్ నుంచి వచ్చిన ఆటగాడే! అయితే ఏడాది తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకుని ఏడో స్థానానికే పరిమితం అయ్యాడు. ఆ పోటీల్లో మిగతా షూటర్స్ కూడా గురి తప్పారు. ఒలింపిక్స్‌లో మనదేశానికి షూటింగ్లో పతకం గ్యారెంటీ అన్న పేరుండేది. అలాంటిది టోక్యోలో మన ఖాతాలో ఒక్క పతకమూ పడలేదు. ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఎదురైంది. అప్పట్లో కొవిడ్ కారణంగా ఆటగాళ్ల శిక్షణ సరిగ్గా సాగలేదు. షూటింగ్‌కు కావాల్సిన మందుగుండు సామగ్రి కూడా అరకొరగానే లభ్యమైంది. కొందరు ఆటగాళ్లయితే ఇంట్లోనే సాధన చేశారు. ఒలింపిక్స్‌కు కొద్దిరోజుల ముందు ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపారు. అక్కడ వాళ్లు నేర్చుకున్నదీ ఏమీ లేదు. భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన షూటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
టోక్యో వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ దీపాలీని పక్కన పెట్టారు. భారత షూటింగ్ సమాఖ్యలో ఆరుగురు చీఫ్ కోచ్‌లు ఉంటే.. ఒక్క దీపాలీపైనే వేటుపడింది. అందరూ తననే టార్గెట్ చేయడంతో ఆమె కుంగిపోయింది. షూటింగ్ రేంజ్‌నే తన ప్రపంచంగా ఊహించుకున్న ఆమెకు అది గడ్డుకాలమే! ఈ కష్టమైన కాలంలో తనకెంతో ఇష్టమైన బొమ్మలు గీస్తూ మళ్లీ పుంజుకుంది. కొన్నాళ్లకు మళ్లీ సొంతంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. టోక్యో పరిణామాల తర్వాత అధికారులు ఆమెను పక్కన పెట్టారే కానీ, దీపాలీ శిష్యులు మాత్రం గురువు వెంటే నిలిచారు. టోక్యోలో పోయిన ప్రతిష్ఠను మళ్లీ పారిస్‌లో నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. అప్పటికి పారిస్ ఒలింపిక్స్‌కి మూడేండ్ల సమయం ఉంది. ఈ కాలంలో తన శిష్యులను మరింత రాటుదేలేలా తీర్చిదిద్దింది. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన షూటర్లలో స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్, శ్రియాంక సదాంగి, సిఫ్ట్ కౌర్ సమ్రా, అర్జున్ బబుతా దీపాలీ శిష్యులే కావడం విశేషం. ఆటగాళ్ల శిక్షణకు దీపాలీని వద్దనుకున్నా.. ఆమె దగ్గర సాధన చేసిన వారినే పోటీలకు ఎంపిక చేయాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 50 మీటర్ల షూటింగ్ 3 పొజిషన్లో కుసాలే కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో పతకం సాధించిన భారతీయుడిగా రికార్డు సాధించాడు. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో బబుతా 0.9 పాయింట్ల తేడాతో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. పారిస్ లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళిక సఫలమైంది. దీపాలీ అనుకున్నది సాధించింది. ఏ ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు రాలేదని తనను షూటింగ్‌కి దూరం పెట్టారో అదే ఒలింపిక్స్‌లో పతకం కొట్టి.. దటీజ్ దీపాలి అనిపించుకుంది. తర్వాత అంజుమ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్ షిప్, వరల్డ్ కప్, ఏషియన్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించాడు.
ఒలింపిక్స్, వరల్డ్ కప్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్వప్నిల్ కుసాలే, అర్జున బబుతా, అంజుమ్ మౌద్గిల్ తమను తీర్చిదిద్దిన దీపాలీ దేశ్‌పాండేకి ద్రోణాచార్య అవార్డు ఇవ్వాలని భారత ప్రభుత్వానికి విన్నవించారు. సుదీర్ఘకాలం షూటింగ్ క్రీడాకారులకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఆమెను దేశం గౌరవించాలని వాళ్లు గొంతెత్తారు. వీళ్లకు మరికొంతమంది క్రీడాకారులు గొంతుకలిపారు. ఆటగాళ్లంతా ‘ఆచార్యదేవోభవ’ అని నినదించడంతో ఆమె సేవలను గుర్తించక తప్పలేదు. అలా దేశం గర్వించే క్రీడాకారులను తీర్చిదిద్దిన గురువుకు ద్రోణాచార్య అవార్డు దక్కడం చంద్రుడికో నూలుపోగు వంటిదే!
టోక్యో ఒలింపిక్స్ అనుభవాలు నేను మరింత బాగా పని చేయడానికి ఉపయోగపడ్డాయి. ఫెడరేషన్లో నా దగ్గర శిక్షణ పొందిన వాళ్లు నా మీద విశ్వాసం ఉంచారు. శిక్షణ కోసం నా దగ్గరికి వచ్చారు. మానసికంగా కుంగిపోయి ఉన్న కాలంలో వాళ్లు నన్ను అభిమానించారు. వాళ్లే నన్ను నమ్మి ఉండకపోతే నేను ఎంత కష్టపడ్డా ఫలితం దక్కకపోయేది. పారిస్‌లో గెలిచింది వాళ్లు మాత్రమే కాదు.. నేను కూడా!
– దీపాలీ దేశ్‌పాండే