Deepak Chahar : పెళ్లిరోజు, పుట్టినరోజు వంటివి ఎవరికైనా ప్రత్యేకమే. అందుకే.. వీటిని గుర్తుపెట్టుకొని మరీ శుభాకాంక్షలు చెబుతాం. అదే భార్యాభర్తలు అనుకోండి.. ఒకరి బర్త్ డేను ఒకరు సెలబ్రేట్ చేస్తూ కానుకలు ఇచ్చిపుచ్చికుంటారు. అయితే.. కొన్నిసార్లు విష్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కొంతసేపు భాగస్వామి అలకకు, చిరు కోపానికి కారణమవుతుంటారు. తాజాగా టీమిండియా పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar) తన భార్య జయ భరద్వాజ్ (Jaya Bhardwaj) పుట్టిన రోజును మర్చిపోయాడు.
ప్రేమించి పెళ్లాడిన ఆమెకు అతడు కనీసం శుభాకాక్షలు కూడా చెప్పలేదు. ఇంకేముంది చాహర్ వైఫ్ పెద్ద గొడవే చేసి ఉంటుందని.. చిన్నబుచ్చుకొని ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్టే. తన ఇష్ట సఖిని పుట్టినరోజున విష్ చేయనందుకు తానేమీ అలకపూనలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడీ పేస్ గన్. ‘హ్యాపీ బర్త్ డే జయ. నా భార్య ఎంతగా నన్ను అర్ధం చేసుకుంటుందో.. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. తన పుట్టిన రోజున విష్ చేయడం నేను మర్చిపోయాను. అయినా సరే తను నన్ను క్షమించింది.
మ్యాచ్ సమయంలో 90 ఓవర్లు ఫీల్డింగ్ చేసి అలసిపోయిన తర్వాత ప్రత్యేక సందర్బాలను గుర్తుపెట్టుకొనే అవకాశం తక్కువని ఆమె గ్రహించింది. అందుకు నేను చాలా లక్కీ. వచ్చే ఏడాది కచ్చితంగా మర్చిపోకుండా శుభాకాంక్షలు చెబుతాను’ అని చాహర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కేకు కట్ చేసిన ఫొటోను పెట్టాడు చాహర్. ఆ పోస్ట్ చూసిన అభిమానులు.. ‘మీ భార్య జయ నిజంగా దేవత.. ఎంత బాగా అర్దం చేసుకుంటుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో చాహర్ సెంట్రల్ జోన్ (Central Zone) తరఫున ఆడుతున్నాడు. మ్యాచ్‌పై ఫోకస్‌తో సెప్టెంబర్ 5న జయ పుట్టినరోజు అనే విషయం అతడు గుర్తు పెట్టుకోలేదు. సో.. అతడు ఆమెను విష్ చేయలేదు. కానీ.. తన భర్త పరిస్థితిని అర్థం చేసుకున్న జయ పెద్ద రాద్ధాంతమేమీ చేయలేదు.
చాహర్, జయది ప్రేమ వివాహం. 2021 ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. మైదానంలోనే చాహర్ తనకు ప్రపోజ్ చేశాడు. మరుసటి ఏడాదే ఈ జంట పెళ్లిచేసుకుంది. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహర్.. టెస్టు చాన్స్ కోసం చూస్తున్నాడు. ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ నుంచి ఈ రైట్ఆర్మ్ పేసర్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.