Dean Elgar : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) ఇక కౌంటీ(County)లపై దృష్టి పెట్టనున్నాడు. కౌంటీల్లో ఎస్సెక్స్(Essex) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఎస్సెక్స్ జట్టుతో మూడేండ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సందర్భంగా నా కెరీర్లో ఇది ఒక కొత్త అధ్యాయం అని ఎల్గర్ అన్నాడు.
‘నా కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ఎస్సెక్స్ జట్టుతో ప్రారంభిస్తున్నందుకు థ్రిల్ అవుతున్నా. గత కొంతకాలంగా ఈ క్లబ్ గొప్పగా ఆడుతోంది. ఎస్సెక్స్ జట్టు మరింత విజయవంతం అయ్యేందుకు నా వంతు కృషి చేస్తా’ అని ఎల్గర్ తెలిపాడు.
ఇక ఎస్సెక్స్ హెడ్‌కోచ్ ఆంథోని మెక్‌గ్రాత్ అయితే.. ఎల్గర్ రాకతో జట్టుతో కొత్త ఉత్సాహం నిండిందని కామెంటు చేశాడు. ‘అనుభవజ్ఞుడైన ఎల్గర్ రాకతో జట్టు బలంగా మారింది. టెస్టు క్రికెట్లో ఎల్గర్ తన పరుగుల దాహాన్ని చాటుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు అతడి శక్తిసామర్థ్యానికి నిదర్శనం’ అని మెక్‌గ్రాత్ తెలిపాడు.
⚙️ The Dean Machine!
🦅 #FlyLikeAnEagle pic.twitter.com/RWw8DCYVKN
— Essex Cricket (@EssexCricket) January 12, 2024
ఫస్ట్ క్లాస్‌లో అదరగొట్టిన ఎల్గర్ 2012లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 12ఏండ్ల కెరీర్లో 82 టెస్టులు ఆడి 5,347 రన్స్ సాధించాడు. అతడి ఖాతాలో 14 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సొంతగడ్డపై కెరీర్లో చివరి సిరీస్ ఆడిన ఎల్గర్ భారత్‌తో జరిగిన సెంచూరియన్(Centurion) టెస్టులో శతకంతో చెలరేగాడు. 180 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెంబ బవుమా గాయపడడంతో న్యూలాండ్స్ టెస్టుకు సారథిగా వ్యవహరించిన ఎల్గర్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా నిప్పులు చెరగడంతో సఫారీ జట్టు చిత్తుగా ఓడిపోయింది.