బెంగుళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ఐపీఎల్ ట్రోఫీ అందించిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఆ జట్టను వీడాడు. గత సీజన్లో సరైన ఫామ్‌లోని లేని వార్నర్‌ను అకస్మాత్తుగా జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో వార్నర్‌ను ఢిల్లీ దక్కించుకున్నది. ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 కోట్లకు కోనుగోలు చేసింది. రెండు కోట్ల బేస్ ప్రైజ్‌పై బిడ్డింగ్ జరిగింది. ఇటీవల ఇన్‌స్టా వీడియోలతో అలరిస్తున్న వార్నర్ ఇక నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీ ప్లేయర్‌గా మారనున్నాడు.
అదరగొట్టిన అయ్యర్
బెంగుళూరులో జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్నది. రైట్ హ్యాండ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకున్నది. వేలంలో 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో అయ్యర్‌పై బిడ్డింగ్ జరిగింది. కానీ అనూహ్యంగా అయ్యర్‌కు భారీ ధర దక్కింది. మొదటి రోజు ఆక్షన్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నది. రబడా 9.25 కోట్లకు అమ్ముడుపోయాడు. శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ 8.25 కోట్లను కొనుగోలు చేసింది. 5 కోట్లకు అశ్విన్‌ను రాజస్థాన్ సొంతం చేసుకున్నది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్‌ను కేకేఆర్ జట్టు 7.25 కోట్లకు కొన్నది. 8 కోట్లకు ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ ఎగురేసుకుపోయింది.