పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు. ఈ క్రమంలో తన కెప్టెన్ రిషభ్ పంత్ గురించి మాట్లాడిన వార్నర్.. ‘‘చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడానికి ఎదురు చూస్తున్నా.
ఇప్పుడిప్పుడే కెప్టెన్సీ నేర్చుకుంటున్న యువకుడతను. ఇంతకాలం తనతో ప్రత్యర్థిగానే తలపడ్డాను. ఇప్పుడు కలిసి బ్యాటింగ్ చేయబోతుండటంతో చాలా ఉత్సాహంగా ఉంది’’ అని చెప్పాడు. అలాగే పంత్ ఆడే సింగిల్ హ్యాండ్ షాట్లు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. చాలా సార్లు పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో ఒంటి చేత్తో బంతిని బౌండరీ దాటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడం కూడా అద్భుతంగా ఉందని వార్నర్ చెప్పాడు.
గతేడాది పేలవ ప్రదర్శనతో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. 2008లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్‌ను.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ జట్టు వేలంలో రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్.. ఈ ఐపీఎల్లో వార్నర్‌కు మొదటిది కావడం గమనార్హం.