ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు గతేడాది ఐపీఎల్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. అతను సారధిగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.. వార్నర్‌ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు కప్పు అందించిన కెప్టెన్ అయిన వార్నర్.. సన్‌రైజర్స్ తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడాడు.
అలాంటి వాడిని సడెన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, జట్టులో కూడా స్థానం ఇవ్వకపోవడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా. చాలా రోజుల తర్వాత వార్నర్ ఈ విషయంపై పెదవి విప్పాడు. తన విషయంలో ఫ్రాంచైజీ పద్ధతిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో ఈ విషయంపై స్పందించిన అతను (David Warner).. ‘‘జట్టుకు ఎంతో చేసిన కెప్టెన్‌ను సడెన్‌గా తొలగించేస్తే కుర్రాళ్లకు ఈ నిర్ణయం ఎలాంటి సందేశం ఇస్తుంది? నాకు చాలా బాధ కలిగించిన అంశమేంటంటే.. ఇప్పుడు జట్టులో మిగతా వాళ్లు కూడా మాక్కూడా ఇలా జరగొచ్చు అనే ఆలోచనలో ఉండటం’’ అన్నాడు.
ఈ విషయంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. తనపై ఇలా అర్ధంతరంగా వేటు వేయడం అభిమానులకు కూడా షాకింగ్‌గా ఉండటం తనను మరింత బాధించిందని చెప్పాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప జట్లన్నింటిలో కూడా ఐకాన్ ప్లేయర్లు ఉంటారని వార్నర్ అన్నాడు.
సన్‌రైజర్స్ జట్టుతో తాను, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా ఉన్నామని, వాళ్లతోనే జట్టు బ్రాండ్ ఏర్పడుతుందని, ఆ బ్రాండ్‌తోనే ముందుకు సాగాలని వివరించాడు. తనను తొలగించిన తర్వాత అభిమానుల రియాక్షన్ తనను చాలా బాధించిందన్నాడు.
తాను ఎక్కడ ఆడుతున్నా, అభిమానులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన వార్నర్ (David Warner).. వాళ్లు జట్టుకు చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ‘‘మైదానంలో ఆడుకునే పిల్లలను కదిలించినా కూడా సచిన్, విరాట్ కోహ్లీ, నేను, స్టీవ్ స్మిత్, విలియమ్సన్ వంటి ఆటగాళ్లు అవ్వాలని చెప్తుంటారు. అలాంటి వారికి ఇలాంటి నిర్ణయాలు చాలా బాధ కలిగిస్తాయి’’ అని సన్‌రైజర్స్ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.