Dan Christian : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ టీ20లకు వీడ్కోలు పలకనున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) తన ఆఖరి టోర్నమెంట్ అని అతను వెల్లడించాడు. బీబీఎల్‌లో అతను సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్నాడు. తన రిటైర్మెంట్ గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో.. బీబీఎల్ సీజన్‌తో ఆటకు గుడ్ బై చెప్తున్నానని నిన్న ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మా జట్టు సభ్యులతో చెప్పాను అని అతను ట్విట్టర్లో రాసుకొచ్చాడు. క్రిస్టియన్ 2006లో టీ20ల్లో ఆరంగ్రేటం చేశాడు. 405 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియన్ 5,809 రన్స్ చేశాడు. బౌలింగ్‌లోనూ చెలరేగుతూ 280 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా పేరొందిన క్రిస్టియన్ ఖాతాలో 9 టీ20 టైటిళ్లు ఉన్నాయి. నిలకడగా రాణించిన అతను జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ 39 ఏళ్ల క్రికెటర్ ఆసీస్ జట్టు తరఫున 20 వన్డేలు, 23 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.
ఐపీఎల్లో మూడు ఫ్రాంఛైజీలకు
క్రిస్టియన్ న్యూ సౌత్‌వేల్స్‌లో జన్మించాడు. పొట్టి క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత పేరు ఢిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.