ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సైప్రస్‌లో జరుగాల్సి ఉన్న క్యాండిడేట్స్ టోర్నీ నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి వైదొలిగిన నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) స్పందించింది. టోర్నీ నిర్వహణకు సైప్రస్ అత్యంత సురక్షితమని తెలిపింది.
ఈ మేరకు ఒక ప్రకటనలో స్పందిస్తూ.. ‘సైప్రస్ సురక్షిత దేశం. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. టోర్నీని విజయవంతం చేయడానికి ఆటగాళ్లు, మీడి యా, అతిథులకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం’ అని తెలిపింది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు టోర్నీ జరిగే ప్రాంతం చాలా దూరమని, ముందుజాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నాకే టోర్నీ నిర్వహణకు అంగీకారం తెలిపామని ఫిడే స్పష్టం చేసింది.