CWC 2023: వన్డే వరల్డ్ కప్ – 2023లో దక్షిణాఫ్రికా అంచనాలకు మించి రాణిస్తోంది. ఇంతవరకూ ఐసీసీ ట్రోఫీ నెగ్గని ఆ జట్టు ఈసారి ఆ కలను నెరవేర్చుకునే దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆల్ రౌండ్ విభాగాల్లో రాణించి అనూహ్య విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే సఫారీలు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవడం లేదు. ముందు బ్యాటింగ్ చేసి ఎడాపెడా పరుగుల వరద పారించి ఆ తర్వాత ఛేదనలో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేస్తోంది. బ్యాటర్ల కష్టాన్ని బౌలర్లు వృథా పోనీయడం లేదు.
మినిమం 300..
ఈ ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడు గెలిచింది. ఈ మూడింటిలో కూడా దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి మూడుసార్లు త్రిశతకాలు (338, 416, 315) దాటించి తర్వాత కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేసి విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా వరల్డ్ కప్‌లో కూడా ఇదే వ్యూహాన్ని పక్కాగా అమలుచేస్తున్నది. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా ఏడు మ్యాచ్‌లు ఆడితే అందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐదు సార్లు 300 ప్లస్ స్కోరును దాటింది. ఈ ఐదింటిలోనూ విజయాలు సాధించింది.
తొలుత శ్రీలంకతో మ్యాచ్‌లో 428 పరుగులు చేసిన సఫారీలు.. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 399, బంగ్లాదేశ్‌పై 382, ఆస్ట్రేలియాపై 311 పరుగులు సాధించారు. తాజాగా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగుల భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్‌లో ఆ జట్టుకు క్వింటన్ డికాక్, వాండెర్ డసెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లు వీరబాదుడు బాదుతున్నారు. ఈ మెగా టోర్నీలో డికాక్ ఇదివరకే నాలుగు సెంచరీలు చేయగా డసెన్ రెండు సాధించాడు. మార్క్రమ్, క్లాసెన్ లు తలా ఓ శతకం చేయడంతో పాటు చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయితే ఏడో స్థానంలో వచ్చిన పేస్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ (75) ఎడాపెడా బాదాడు. ఆ జట్టు కెప్టెన్ బవుమా మినహా మిగిలిన బ్యాటర్లంతా మినిమం బాదే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేస్తున్నారు.
South Africa in World Cup 2023 while batting first:
428/5(50) vs Sri Lanka.
311/7(50) vs Australia.
399/7(50) vs England.
382/5(50) vs Bangladesh.
357/4(50) vs New Zealand.– This is unreal…..!!!!!! pic.twitter.com/zoyyxgXy9L
— Johns. (@CricCrazyJohns) November 1, 2023
బౌలర్ల జోరు..
తొలుత బ్యాటర్లు భారీ పరుగులు చేయడంతోనే ప్రత్యర్థి జట్లు ఒత్తిడికి సగం చస్తున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసి ఛేదనకు వచ్చిన జట్లలో ఒక్క శ్రీలంక మాత్రమే కాస్త ప్రతిఘటించింది. మిగిలిన జట్లు భారీ తేడాతో ఓడక తప్పలేదు. 312 పరుగుల ఛేదనలో కంగారూలను 177 పరుగులకే కట్టడి చేసిన సఫారీ బౌలర్లు.. 400 ఛేదనలో ఇంగ్లండ్‌ను 170కే ఆలౌట్ చేశారు. 383 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ 233 పరుగులకే తలవంచింది. 358 టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కివీస్ 167 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ పేస్ త్రయం మార్కో జాన్సెన్,లుంగి ఎంగిడి, కగిసొ రబాడా తో పాటు గెరాల్డ్ కొయెట్జ్లు భారత పిచ్‌లపై చెలరేగుతున్నారు. ముఖ్యంగా ఆరంభంలోనే వికెట్లు తీయడంలో జాన్సెన్ వందకు వంద మార్కులు కొట్టేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్‌లో కొయెట్జ్, రబాడాలు ప్రత్యర్థులను కుదురుకోనివ్వడం లేదు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా మెరుస్తున్నారు.
South Africa in the last 8 wins while batting first.
– Won by 111 runs vs AUS
– Won by 164 runs vs AUS
– Won by 122 runs vs AUS
– Won by 102 runs vs SL
– Won by 134 runs vs AUS
– Won by 229 runs vs ENG
– Won by 149 runs vs BAN
– Won by 190 runs vs NZ pic.twitter.com/t5yAczdHEG— Johns. (@CricCrazyJohns) November 1, 2023
ఇదివరకే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న సఫారీలు ఇదే దూకుడు కొనసాగిస్తే మూడు దశాబ్దాలుగా ఆ దేశానికి అందని ద్రాక్షలా ఊరిస్తున్న తొలి ఐసీసీ వరల్డ్ కప్ ఆ జట్టు సొంతమవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కీలక సమయాల్లో అనూహ్యంగా చతికిలపడుతూ ‘చోకర్స్’ అన్న ముద్ర వేసుకున్న సఫారీలు రాబోయే రోజుల్లో ఎలా ఆడతారో చూడాలి.