Babar Azam | అఫ్గానిస్తాన్‌పై ఓటమి పాకిస్తాన్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబర్ సారథ్యంపై ఆ జట్టు మాజీ సారథులు వసీం అక్రమ్, మిస్బా ఉల్ హక్, షోయబ్ మాలిక్, మోయిన్ ఖాన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల నుంచి బాబర్ పాకిస్తాన్ జట్టుకు సారథిగా ఉంటున్నా ఓటముల నుంచి అతడు నేర్చుకున్నది శూన్యమని విమర్శించారు. కెప్టెన్సీ రోల్‌కు అతడు ఎంతమాత్రమూ అర్హుడు కాదని వాపోయారు.
పాకిస్తాన్ ఓటమి తర్వాత పాకిస్తాన్‌లోని ‘ఎ స్పోర్ట్స్’ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అక్రమ్ మాట్లాడుతూ.. ‘ పీసీబీ ఛైర్మన్, సెలక్టర్లు, కోచ్‌లు.. అందరూ ఈ ఓటమికే బాధ్యులే..’ అని చెప్పాడు. షోయబ్ మాలిక్ స్పందిస్తూ.. ‘ఒక జట్టుకు కెప్టెన్ అంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలి. బ్యాటర్‌గా బాబర్ ఆజమ్ బాగానే ఆడుతున్నాడు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ సారథిగా మాత్రం అతడు పనికిరాడు..’ అని కామెంట్స్ చేశాడు. మరో మాజీ సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ అయిన మోయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘బాబర్ గత నాలుగేండ్లుగా జట్టును నడిపిస్తున్నాడు. దాదాపు పెద్ద ఈవెంట్స్‌లో అతడు సారథిగా వ్యవహరిస్తున్నా ఒక్కటంటే ఒక్క విషయం కూడా తన తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు..’ అని చెప్పాడు.
ఇక మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి వారిని ఔట్ చేసే వ్యూహాలను అమలుచేయడంలో బాబర్ విఫలమవుతున్నాడని మిస్బా ఉల్ హక్ అన్నాడు. ‘కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు అతడిపై ఒత్తిడి పెంచేందుకు గాను పటిష్టమైన వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. కానీ బాబర్ మాత్రం అలాంటిదేమీ చేయడం లేదు. బ్యాటర్ చుట్టూ ఫీల్డర్ల మొహరింపు లేదు. అలాంటి వ్యూహాలను కచ్చితంగా అమలుచేయాలి. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో బాబర్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపించింది..’ అని మిస్బా తెలిపాడు.
వ్యూహాల గురించి చర్చ రాగా మిస్బా చెప్పినదానికి కొనసాగింపుగా అక్రమ్ మాట్లాడుతూ..‘అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 45వ ఓవర్లో స్పిన్నర్‌తో బౌలింగ్ వేయించడం చెత్త ఆలోచన. అప్పటికీ షహీన్‌తో పాటు హరీస్కూ తలా రెండు ఓవర్లున్నాయి. హసన్ అలీకి ఒక ఓవర్ ఉంది. కానీ బాబర్.. బంతిని స్పిన్నర్‌కు ఇచ్చాడు. ఒసామా మిర్ ఆ ఓవర్లో 11 పరుగులిచ్చాడు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు మిస్బా స్పందిస్తూ.. ‘స్పిన్నర్లే కాదు. మన పేసర్లు కూడా ధారాళంగా పరుగులిస్తున్నారు. హరీస్ రౌఫ్ లయ కోల్పోయి దాదాపు అతడు వేసిన ప్రతి ఫస్ట్ ఓవర్లో 18 నుంచి 25 పరుగులు సమర్పించుకున్నాడు…’ అని అన్నాడు.