CSK | అహ్మదాబాద్: ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం ఒడిదొడుకులతో సాగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రయాణం విజయంతో ముగిసింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై.. టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్‌కు షాకిస్తూ ఆ జట్టుపై 83 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. డబుల్ హెడర్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుష్ మాత్రె (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో ఈ సీజన్లో సీఎస్కే తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారీ ఛేదనలో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ (3/13), నూర్ అహ్మద్ (3/21), రవీంద్ర జడేజా (2/17) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.
అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆయుష్.. 6, 6, 4, 4, 6తో 28 పరుగులు పిండుకుని చెన్నైని టాప్ గేర్‌లోకి తెచ్చాడు. ఆ తర్వాత కాన్వే, ఉర్విల్.. స్కోరు వేగం తగ్గకుండా ధాటిగా ఆడటంతో 9 ఓవర్లకే చెన్నై 100 పరుగుల మార్కును అందుకుంది. ఈ ఇద్దరూ నిష్క్రమించినా ఆఖర్లో జడేజా (21)తో కలిసి బ్రెవిస్.. టైటాన్స్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఛేదనలో మూడో ఓవర్లోనే సారథి గిల్ (13) వికెట్ కోల్పోయిన టైటాన్స్.. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు.
బట్లర్ (5), రూథర్‌ఫర్డ్ (0), షారుక్ (13), తెవాటియా (14) విఫలమయ్యారు. ఆరంభంలో జడేజా, అన్షుల్ గుజరాత్‌ను దెబ్బతీస్తే నూర్ లోయరార్డర్ పనిపట్టాడు. కాగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడి నాలుగింట్లో మాత్రమే గెలిచిన చెన్నై.. 8 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. ఒక ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడం చెన్నైకి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
1