ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (0) ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. డానియల్ శామ్స్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి మిస్ అయ్యి అతని ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుటిచ్చాడు.
సాంకేతిక కారణంతో అప్పటికి డీఆర్ఎస్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. దీంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అదే ఓవర్లో మొయీన్ అలీ (0) కూడా డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. శామ్స్ వేసిన షార్ట్ బాల్‌ను ఎలా ఆడాలో అలీ సరిగా నిర్ణయించుకోలేదు. పుల్ షాట్ ఆడబోయి కూడా ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నాడు.
ఈ క్రమంలో అతని బ్యాటును తాకిన బంతి గాల్లోకి లేచింది. షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న హృతిక్ షోకీన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకోవడంతో అలీ కూడా మైదానం వీడాడు. దీంతో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది.